Tuesday, April 26, 2011

స్థానిక సమస్యల పరిష్కా రానికి సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర

            హైదరాబాద్ లో ఉప్పల్  హబ్సిగూడ డివిజన్‌ పరిధిలోని స్థానిక సమస్యల పరిష్కా రానికి హబ్సిగూడ డివిజన్‌ సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఉప్పల్‌ జోన్‌ కార్యదర్శి కె.రవి పాదయాత్రను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి సిపిఎం నాయకులు పి.గణేష్‌, ఐద్వా జోన్‌ కార్యదర్శి వినోద పాల్గొని రామాంతాపూర్‌ చెరువులో పాదయాత్ర చేసి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామంతాపూర్‌ చెరువులోని గుడిసెల్లో సమస్యలు, తాగునీటి సమస్యలు, దోమల సమస్యలు అధికంగా ఉన్నాయని, ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చెరువులో ఉండడం వలన పాములు, తేళ్ళు అధికంగా వస్తున్నాయని, కరెంటు సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.
             గాంధీ గిరిజన బస్తీలో రేషన్‌కార్డులు లేవని, రేషన్‌కార్డులు ఉన్నా రేషన్‌ ఇవ్వడం లేదని మురికినీటి సమస్య, ఇంటి సమస్య ఉందని బస్తీవాసులు వాపోయారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్‌ డివిజన్‌ సిపిఎం నాయకులు జె.వెంకన్న, డివైఎఫ్‌ఐ సెక్రటరీ కె.విజరు, హబ్సిగూడ డివిజన్‌ కమిటీ ఐద్వా నాయకురాలు నాగలక్ష్మి, అంజమ్మ, సత్యవతి, కైదర్‌బీ, ఆశా, పరంగిని, రుక్కా, కమల, రాజమణి, పార్వతమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

cpi(m) hyd బస్తీవాసులకు ఇళ్ల పట్టాలివ్వాలి : సిపిఎం

              హైదరాబాద్  లో  ముషీరాబాద్‌ జోన్‌ గాంధీనగర్‌ డివిజన్‌లోని స్థానిక సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. సోమవారం నిర్వహించిన పాదయాత్రలో పలు బస్తీలైన శాంతి యువజన సంఘం, కెవిఎన్‌ చారినగర్‌, డప్పులయ్యబస్తీ, ఎస్‌ఆర్టీ క్వార్టర్స్‌, వాల్మీకీనగర్‌లో పలు సమస్యలు నాయకుల దృష్టికి తెచ్చారు. 
           ఈ సందర్భంగా సిపిఎం ముషీరాబాద్‌ జోన్‌ కార్యదర్శివర్గ నాయకుడు ఎం.దశరథ్‌ మాట్లాడుతూ వివిగిరినగర్‌, డప్పులయ్యబస్తీ, అన్నానగర్‌ బస్తీవాసులకు ఇళ్లపట్టాలివ్వాలని, ఎస్‌ఆర్టీ వాకర్‌గ్రౌండ్‌లో నివసిస్తున్న పేద వారికి గుడిసెలిచ్చి, అర్హులైన వారికి ఇళ్ళపట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు చేసుకున్న వారికి వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. డివిజన్‌లో పాడైన రోడ్లను ఇప్పటికీ పట్టించుకోకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్త చేశారు. రాత్రిపూట వీధి లైట్లు వెలగడం లేదని వాటిని వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వృద్ధాప్య, వితంతువు, వికలాంగ ఫించన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజాసమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ప్రజాపోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈ పాదయాత్రలో కన్వీనర్‌ ఎస్‌.దశరథ్‌, రాంచందర్‌, యాదగిరి, అబ్బురాములు, రమేష్‌, హరి, హరినాధ్‌ తదితరులు పాల్గొన్నారు.

Sunday, April 24, 2011

హైదరాబాద్ లో స్థానిక సమస్యలపై సిపిఎం పోరు

హైదరాబాద్ లో స్థానిక సమస్యలపై సిపిఎం పోరు  ప్రారంభించారు. కడప ఉప ఎన్నికల్లో మంత్రులు బిజీగా ఉన్నారు. ప్రజాసమస్యలు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన కార్పొరేటర్లు తమ వ్యక్తిగత లబ్ధికోసం పాకులాడుతున్నారు. వారికి ల్యాప్‌ట్యాపులు, మెడికల్‌ రీయింబర్స్‌మెంటు, విదేశీ ప్రయాణాలపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై కరువైంది. అధికారుల్లో అలసత్వం అలుముకుంది. ఈ నేపథ్యంలో నగరంలో స్థానిక సమస్యలపై సిపిఎం పోరు తలపెట్టింది. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా కార్యకర్తలు, నాయకులు పాదయాత్రలు చేపట్టారు. మంచినీటి సరఫరా, డ్రెయినేజీ, సివరేజీ, రోడ్లు, వీధిలైట్లు, పింఛన్లు, రేషన్‌కార్డులు, పొదుపు సంఘాల మహిళలకు గ్యాస్‌కనెక్షన్‌ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
                   ఏప్రిల్‌ 15 నుంచి 150 డివిజన్లలో సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్రలు ప్రారంభించారు. కార్యకర్తలు దళాలుగా ఏర్పడి బస్తీల్లో ఇంటింటికీ తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను తమ ఇంటిముందుకు వచ్చి సిపిఎం నాయకులు అడిగి తెలుసుకుంటున్నారని నగరవాసులు చర్చించుకుంటున్నారు. దీంతో ప్రజల నుంచి పాదయాత్రలకు మంచి స్పందన లభిస్తోంది. నాయకులు సమస్యలు తెలుసుకోవడంతో పాటు స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వినతి పత్రాలిచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అధికారుల్లో కొంత మేర చలనం వచ్చి ఆయా ప్రాంతాల్లో కొన్ని సమస్యలు పరిష్కరించారు.

Saturday, April 23, 2011

బాగ్ లింగంపల్లి డివిజన్‌లోని స్థానిక సమస్యలు పరిష్కరించాలని పాదయాత్ర

            హైదరాబాద్ లో ముషీరాబాద్‌ జోనులోని బాగ్ లింగంపల్లి  డివిజన్‌లోని స్థానిక సమస్యలు పరిష్కరించాలని సిపిఎం బాగ్ లింగంపల్లి  కమిటీ ఆధ్వర్యంలో  బాగత్ సింగ్ నగర్, శ్రిరాం నగర్, సంజయ్ నగర్, అచ్చయ్య నగర్, పాలమూరు.... బస్తీలలో కార్యకర్తలతో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో సిపిఎం  కార్యదర్శి  పి.ఎస్.ఎన్.మూర్తి, ప్రారంభించి మాట్లాడుతూ దశాబ్దాలు గడుస్తున్న స్థానిక బస్తీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదన్నారు. డ్రెయినేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలేదన్నారు. రేషన్‌ సమస్యలు, పెన్షన్లు తదితర సమస్యలతో సతమతమౌతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులు స్థానికుల సమస్యలను గాలికి వదిలేసి వారి పనులను చక్కబెట్టుకుంటునరన్నారు. బస్తీలలోని ప్రజలు అనేక సమస్యలను ఈ పాదయాత్రలో నాయకులకు తెలిపారు.    
                   రాజీవ్‌గృహకల్ప కోసం కట్టిన డబ్బులు ఆరు సంవత్సరాలు కావస్తోన్న ఇంత వరకు ఇళ్ళు ఇవ్వలేదన్నారు. డ్రెయినేజీవ్యవస్థ సరిగాలేక నిత్యం రోడ్డుపైన మురుగునీరు చేరుతుందన్నారు. వృద్ధాప్య, వితంతు పింఛన్లు రావడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాదయాత్ర లో   సిపిఎం ముషీరాబాద్‌ జోను కార్యదర్శివర్గ సభ్యులు పి. గెల్వయ్య,   డివిజన్‌ నాయకులు జి.రాములు, వెంకన్న, రమేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

దోమలగూడ వాసుల సమస్యలు పరిష్కరించాలి - సిపిఎం పాదయాత్ర

          హైదరాబాద్ లో  ముషీరాబాద్ నియోజకవర్గం దోమలగూడ డివిజన్‌లోని స్థానిక సమస్యలు పరిష్కరించాలని సిపిఎం దోమలగూడ కమిటీ ఆధ్వర్యంలో పూల్‌బాగ్‌, మైసమ్మబండ, జ్యోతినగర్‌, దేవిప్రసాద్‌బాగ్‌, తాళ్లబస్తీ, బండనగర్‌, సూరజ్‌నగర్‌, ఈశ్వరమ్మబాడ, ఎంసిహెచ్‌ క్వార్టర్స్‌, గంగానగర్‌, బ్యాంక్‌కాలనీలో కార్యకర్తలతో పాదయాత్ర నిర్వహించారు. 
            ఈ పాదయాత్రలో సిపిఎం ముషీరాబాద్‌ కార్యదర్శివర్గ సభ్యులు ఎం.దశరథ్‌ పూల్‌బాగ్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించి మాట్లాడుతూ దశాబ్దాలు గడుస్తున్న స్థానిక బస్తీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదన్నారు. డ్రెయినేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలేదన్నారు. రేషన్‌ సమస్యలు, పెన్షన్లు తదితర సమస్యలతో సతమతమౌతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులు స్థానికుల సమస్యలను గాలికి వదిలేసి వారి పనులను చక్కబెట్టుకుంటునరన్నారు. బస్తీలలోని ప్రజలు అనేక సమస్యలను ఈ పాదయాత్రలో నాయకులకు తెలిపారు. రాజుకాలనీలో కమ్యూనిటీహాల్‌ నిర్మించాలని, అశోక్‌నగర్‌లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోడ్లు వేయాలని, రాజీవ్‌గృహకల్ప కోసం కట్టిన డబ్బులు ఆరు సంవత్సరాలు కావస్తోన్న ఇంత వరకు ఇళ్ళు ఇవ్వలేదన్నారు. సూరజ్‌నగర్‌లో మంచినీటిలో కలుషితనీరు కలసి వస్తోందన్నారు. డ్రెయినేజీవ్యవస్థ సరిగాలేక నిత్యం రోడ్డుపైన మురుగునీరు చేరుతుందన్నారు. వృద్ధాప్య, వితంతు పింఛన్లు రావడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాదయాత్రకు సిపిఎం డివిజన్‌ కన్వీనర్‌ సిహెచ్‌.శ్రీనివాస్‌ నాయకత్వం వహించగా, డివిజన్‌ నాయకులు మహ్మద్‌ యూసఫ్‌, జి.సంతోష్‌, కృష్ణ, పొన్నస్వామి, హనుమంతు లక్ష్మయ్య, శ్రీను, ఎల్లయ్య, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Tuesday, April 19, 2011

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై బస్తీల్లో సిపిఎం పాదయాత్రలు

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై బస్తీల్లో సిపిఎం పాదయాత్రలు చేపడుతోందని మాజీ ఎంపి పి.మధు అన్నారు. ఎల్బీనగర్‌ జోన్‌ ( హైదరాబాద్ ) పరిధిలోని ఫతుల్లాగూడ, జైపురికాలనీ, బ్లైండ్‌కాలనీ, వడ్డెరబస్తీ, నువ్వులబండ తదితర కాలనీల్లో సిపిఎం నిర్వహిస్తున్న పాదయాత్రలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫతుల్లాగూడలోని గుడిసవాసులకు వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, 166 జిఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కర్మన్‌ఘాట్‌ డివిజన్‌లోని గుంటి జంగయ్య కాలనీలోని ప్రజలు చాలాకాలంగా డ్రెయినేజీ, రోడ్లు సరిగా లేక అవస్తలు పడుతున్నారని, ఈ విషయం ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధికార యంత్రాంగంలో కదలిక లేదని విమర్శించారు. రాజీవ్‌ ఆవాస్‌ యోజన పథకం కింద మురికివాడలు లేని నగరంగా మారుస్తామని, మురికివాడల అభివృద్ధిని వదిలేసి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ ప్రయత్నాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 2007లో ఇంటింటికి ఇందిరమ్మ సర్వేలో గుర్తించిన లబ్ధిదారులకు వెంటనే గుర్తింపు కార్డులు ఇచ్చి ఇళ్లు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌, చంద్రమోహన్‌, కొండల్‌గౌడ్‌, ఎల్లయ్య, రాములు, యాదయ్య, కృష్ణారెడ్డి, సుమిత్ర, ముత్తమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Monday, April 18, 2011

ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధం కావాలి ...మాజీ ఎంపి పి.మధు

             సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధం కావాలని మాజీ ఎంపి పి.మధు ప్రజలకు పిలుపునిచ్చారు. జిహెచ్‌ఆర్‌ఎఫ్‌, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కాప్రాలోని ( హైదరాబాద్ ) గాంధీ నగర్‌ నుంచి పాదయాత్రను ఆదివారం ప్రారంభించారు. పాదయాత్రలో ప్రజలు పలు సమస్యలను నాయకుల దృష్టికి తెచ్చారు. గాంధీనగర్‌ ఎస్‌సి బస్తీకి చెందిన శ్మశాన వాటికకు దారి లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ కాలనీ మాజీ అధ్యక్షులు ఆగయ్య నాయకుల దృష్టికి తెచ్చారు. పురాతన కాలంనాటి శ్మశాన వాటిక ఉన్న రోడ్డు సౌకర్యం లేదని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, భూస్వాములు, పాత కాలంనాటి బాట సైతం కబ్జా చేశారని తెలిపారు. తాగడానికి, వాడుకోవడానికి నీరులేక ఇబ్బందులకు గురౌతున్నామని, 4 రోజులకోసారి నీరు సరఫరా అవుతుందని తెలిపారు. డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్‌ పై మూతలు లేవని బస్తీ వాసులు తెలిపారు. కాప్రా ఎస్టీ బస్తీ, ఎల్లారెడ్డిగూడ, వంపుగూడ, సాయిబాబానగర్‌, సాయిరాంనగర్‌, బిజెఆర్‌ నగర్‌, జమ్మిగడ్డ, బిఎన్‌రెడ్డి నగర్‌, పూకట్‌ నగర్‌, చర్లపల్లి, భరత్‌నగర్‌లో పాదయాత్ర సాగింది. అనేక బస్తీల్లోను నీటి సమస్య తీవ్రంగా ఉందని అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని వంపుగూడ, న్యూ ఇందిరానగర్‌, సాయిబాబానగర్‌, చర్లపల్లి, బస్తీ ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. వెంటనే వాటర్‌ వర్క్స్‌ అధికారులతో చర్చించి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని, లేకుంటే ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. రేషన్‌ కార్డులు, పింఛన్ల కోసం రచ్చబండలో దరఖాస్తులు తీసుకొని నేటికీ పట్టించుకోలేదని హామీలకే పరిమితం అమయ్యారని మహిళలు ఆయన దృష్టికి తేగా, పాదయాత్ర ముగిసిన తర్వాత ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో మధుకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ బస్తీ వాసులు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధం కావాలని, అప్పడే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఆర్‌ఎఫ్‌ నగర కార్యదర్శి సహదేవ్‌, నాయకులు చంద్రశేఖర్‌, జిహెచ్‌ఆర్‌ఎఫ్‌ కాప్రా కార్యదర్శి శ్రీనివాసులు, డివైఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు బాబురావు, నర్సింగ్‌రావు, చేతి వృత్తిదారుల సంఘం నాయకులు శ్రీరాములు, నారాయణ, ప్రజానాట్య మండలి కళాకారులు, ఎం.శ్రీనివాస్‌, కార్తీక్‌, కాంతారావు, కనకయ్య, మారన్న, భాస్కర్‌, ప్రసాద్‌, దేవి తదితరులు పాల్గొన్నారు.

Sunday, April 17, 2011

పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం ... సిపిఎం పాదయాత్రలో మధు

              పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమౌతాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి.మధు అన్నారు. శుక్రవారం నాడు మల్కాజిగిరి సర్కిల్‌  ( హైదరాబాద్ ) పరిధిలోని మౌలాలి డివిజన్‌లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు సిపిఎం పాదయాత్ర చేపట్టింది. దాదాపు 150 మంది కార్యకర్తలతో పాదయాత్ర సాగింది. పాదయాత్రలో మాజీ ఎంపి పి.మధు పాల్గొన్నారు. క్రిష్ణానగర్‌, ఆర్టీసీ కాలనీ, హనుమాన్‌నగర్‌, భరత్‌నగర్‌, షఫీనగర్‌ ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టారు. ప్రజలు పలు సమస్యలను మధు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ శివారు ప్రాంతాల్లో రోజుమార్చి రోజు నీళ్లిస్తామని చెప్పిన ప్రభుత్వం 10 రోజులకోసారి ఇస్తోందన్నారు. అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ లేదని, పలుచోట్ల రోడ్లు లేవని అన్నారు. అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెబుతోన్న ప్రభుత్వం కాగితాల్లో మాత్రమే అభివృద్ధి చూపిస్తోందన్నారు. శివారు ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తెలిపిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తామన్నారు. లేదంటే స్థానికులను సమీకరించి ఆందోళన చేపడుతామన్నారు. పాదయాత్రలో స్థానికులు పలు సమస్యలు విన్నవించారు. మంచినీరు ఆరు నుంచి 10 రోజులకోసారి వస్తోందని, అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ లేక ఓపెన్‌ నాలాలు నిండిపోయి దుర్గంధం వస్తోందని చెప్పారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీని నిర్మించాలని కోరారు.

                     బండ చెరువులోకి డ్రెయినేజీ నీళ్లు చేరటం వల్ల మురికి కూపంగా మారిందన్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు దుర్గంధంతో ఇబ్బందులకు గురౌతున్నారని చెరువుకు పెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని కోరారు. బండ చెరువులో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి డ్రెయినేజీ నీరు చేరకుండా ప్రత్యేక ఛానల్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు. పలు బస్తీల్లో అంతర్గతంగా ఉన్న రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. హనుమాన్‌ నగర్‌లో ఉన్న పెద్ద ఓపెన్‌నాలా పైకప్పు వేయాలన్నారు. కృష్ణానగర్‌లో నాలుగు గల్లీల్లో రోడ్లే లేవని చెప్పారు. భరత్‌నగర్‌లో 150 కుటుంబాలున్నాయని, తమతో డబ్బు కట్టించుకొని విద్యుత్‌ మీటర్లు ఇవ్వలేదని తెలిపారు. విద్యుత్‌ సమస్యతో బాధపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలో చెరువులన్నీ కాలుష్యమయంగా మారాయని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌ మాట్లాడుతూ 15 రోజుల పాటు పాదయాత్ర చేస్తామని ప్రజలు తమ సమస్యలను తెలపాలని కోరారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. పరిష్కారమయ్యే వరకూ పోరాడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి కమిటీ కార్యదర్శి ఎన్‌.శ్రీనివాస్‌, నాయకులు పి.నర్సయ్య, ఎం.లక్ష్మణ్‌, అన్నపూర్ణ, మంగ, కిశోర్‌, దీపిక, ఆవాజ్‌ నాయకులు, ప్రజానాట్యమండలి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

Thursday, April 14, 2011

cpi(m) hyd కా. బసవపున్నయ్య గారి వర్దంతి

సి.పి.యం. నగర కార్యాలయంలొ కా. బసవపున్నయ్య గారి వర్దంతి 12.04.2011న జరిగింది. పార్టీ సీనియరు నాయకులు కా. టి.వి.చారి, కా.పి.ఎస్.ఎన్. మూర్తి పాల్గొంన్నారు

Sunday, April 3, 2011

నగరంలో విద్యుత్‌ ఛార్జీలపెంపుపై నిరసనల వెల్లువ

విద్యుత్‌ ఛార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ నగరవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారంనాడు సిపిఎం ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. లాంతర్లతో వినూత్న ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఐక్యపోరాటాలు చేపడుతామని నాయకులు హెచ్చరించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రకమిటీ సభ్యులు పి.మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సారంపల్లి మల్లారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, నగర కమిటీ నాయకులు, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, జిహెచ్‌ఆర్‌ఎఫ్‌, ఆవాజ్‌, పట్టణ పౌర సంఘాల సమాఖ్య, రజకసంఘం, మత్స్యకార్మిక సంఘం, తదితర ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలు లాంతర్లు, దీపాలు చేతబట్టి ప్రదర్శిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బినగర్‌, రాజేంద్రనగర్‌, ఛత్రినాక, బార్కస్‌, ఇసిఐఎల్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌, కుత్భుల్లాపూర్‌, షాపూర్‌నగర్‌, గండిమైసమ్మ చౌరస్తాతోపాటు నగర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి.

Friday, April 1, 2011

cpi(m) hyd. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని సిపిఎం ధర్నా

విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని సిపిఎం ధర్నా

     పెరుగుతున్న విద్యుత్‌ ధరలకు నిరసనగా సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ డిఇ కరెంటు కార్యాలయం ముందు గురువారం నాడు సికింద్రాబాద్‌ జోన్‌ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు ఎన్‌.సోమయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పేద, మద్య తరగతి కుటుంబాలకు ఉచిత విద్యుతంటూ, ఎలక్షన్లు ముగిసిన తరువాత విద్యుత్‌ ధరలు పెంచి ప్రజలను ఏప్రిల్‌ ఫూల్‌ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో ప్రజలు పెద్ద ఎత్తున విద్యుత్‌ పోరాటాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోరాటాలు చేసిందన్నారు. పేద ప్రజలకు అన్ని విధాలుగా ప్రభుత్వం నిత్యావసరాల ధరల్ని పెంచి ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యుత్‌ ధరలు పెంపు నిర్ణయాన్ని వెనుక్కు తీసుకోవాలని లేనిపక్షంలో ప్రజలే కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారని, చివరికి పేద ప్రజలే పెద్ద ఎత్తున విద్యుత్‌ పోరాటాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్‌ కార్యదర్శి ఆర్‌.మల్లేష్‌, సికింద్రాబాద్‌ కన్వీనర్‌ అజరుబాబు, సనత్‌నగర్‌ కన్వీనర్‌ పి.వెంకటేష్‌, సికింద్రాబాద్‌ డివైఎఫ్‌ఐ నాయకులు మహేందర్‌, ఐద్వా నాయకురాలు శారద, వీరలక్ష్మి, అంజమ్మ, లక్ష్మి, నాయకులు సుకియాన్‌, యాదగిరి, రాజు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.