Sunday, April 17, 2011

పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం ... సిపిఎం పాదయాత్రలో మధు

              పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమౌతాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి.మధు అన్నారు. శుక్రవారం నాడు మల్కాజిగిరి సర్కిల్‌  ( హైదరాబాద్ ) పరిధిలోని మౌలాలి డివిజన్‌లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు సిపిఎం పాదయాత్ర చేపట్టింది. దాదాపు 150 మంది కార్యకర్తలతో పాదయాత్ర సాగింది. పాదయాత్రలో మాజీ ఎంపి పి.మధు పాల్గొన్నారు. క్రిష్ణానగర్‌, ఆర్టీసీ కాలనీ, హనుమాన్‌నగర్‌, భరత్‌నగర్‌, షఫీనగర్‌ ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టారు. ప్రజలు పలు సమస్యలను మధు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ శివారు ప్రాంతాల్లో రోజుమార్చి రోజు నీళ్లిస్తామని చెప్పిన ప్రభుత్వం 10 రోజులకోసారి ఇస్తోందన్నారు. అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ లేదని, పలుచోట్ల రోడ్లు లేవని అన్నారు. అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెబుతోన్న ప్రభుత్వం కాగితాల్లో మాత్రమే అభివృద్ధి చూపిస్తోందన్నారు. శివారు ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తెలిపిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తామన్నారు. లేదంటే స్థానికులను సమీకరించి ఆందోళన చేపడుతామన్నారు. పాదయాత్రలో స్థానికులు పలు సమస్యలు విన్నవించారు. మంచినీరు ఆరు నుంచి 10 రోజులకోసారి వస్తోందని, అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ లేక ఓపెన్‌ నాలాలు నిండిపోయి దుర్గంధం వస్తోందని చెప్పారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీని నిర్మించాలని కోరారు.

                     బండ చెరువులోకి డ్రెయినేజీ నీళ్లు చేరటం వల్ల మురికి కూపంగా మారిందన్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు దుర్గంధంతో ఇబ్బందులకు గురౌతున్నారని చెరువుకు పెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని కోరారు. బండ చెరువులో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి డ్రెయినేజీ నీరు చేరకుండా ప్రత్యేక ఛానల్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు. పలు బస్తీల్లో అంతర్గతంగా ఉన్న రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. హనుమాన్‌ నగర్‌లో ఉన్న పెద్ద ఓపెన్‌నాలా పైకప్పు వేయాలన్నారు. కృష్ణానగర్‌లో నాలుగు గల్లీల్లో రోడ్లే లేవని చెప్పారు. భరత్‌నగర్‌లో 150 కుటుంబాలున్నాయని, తమతో డబ్బు కట్టించుకొని విద్యుత్‌ మీటర్లు ఇవ్వలేదని తెలిపారు. విద్యుత్‌ సమస్యతో బాధపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలో చెరువులన్నీ కాలుష్యమయంగా మారాయని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌ మాట్లాడుతూ 15 రోజుల పాటు పాదయాత్ర చేస్తామని ప్రజలు తమ సమస్యలను తెలపాలని కోరారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. పరిష్కారమయ్యే వరకూ పోరాడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి కమిటీ కార్యదర్శి ఎన్‌.శ్రీనివాస్‌, నాయకులు పి.నర్సయ్య, ఎం.లక్ష్మణ్‌, అన్నపూర్ణ, మంగ, కిశోర్‌, దీపిక, ఆవాజ్‌ నాయకులు, ప్రజానాట్యమండలి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment