Tuesday, February 21, 2012

ప్రజాస్వామ్యం ఖూనీ....

మధుపై ఎంఐఎం దాడి, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స


                         పాతబస్తీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఓ మృతుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి మధుతో పాటు నగర నాయకులు ఎం శ్రీనివాస్‌పై పోలీసుల సమక్షంలోనే మజ్లిస్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, కార్పొరేటర్‌ వాజీద్‌లు తమ అనుయాయులతో భౌతిక దాడికి దిగారు. ఈ దాడిలో మధు, ఎం శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురు సిపిఎం స్థానిక నాయకులు గాయపడ్డారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఎంఐఎం నేతలు దాడికి పాల్పడడం ద్వారా తమ నిజస్వరూపాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. పాతబస్తీ తమ జాగీరుగా భావించే మజ్లిస్‌, ఇతర పార్టీలు పాతబస్తీలో ప్రవేశించడం సహించలేక పోతోంది. సిపిఎంపై గతంలోనూ పాతబస్తీలో మజ్లిస్‌ గూండాలు దాడులు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే పరామర్శకు పోయినపుడు దాడికి పాల్పడిన సందర్భం చూస్తుంటే ఎంఐఎం దుర్మార్గం ఏ పాటిదో అర్థమవుతోంది. 

                      40ఏళ్లుగా పాతబస్తీ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ ప్రజా సమస్యలను పట్టించుకున్న దాఖలాల్లేవు. మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి అక్రమార్జనతో కోట్లు గడించిన నాయకులు రౌడీయిజం, గూండాయిజం ద్వారా రాజ్యమేలుతున్నారు. ఆ పార్టీని ఎదిరించిన యువతపై తప్పుడు కేసులు బనాయించడం, రౌడీషీట్లు తెరిపించడం, yదురించిన వారిని అణిచివేసే చర్యలకు పాల్పడడం ఆనవాయితీగా మారింది. 


        మృతుడు  సూసైడ్‌ నోట్‌లో రాశాడు. అయితే ఆ సూసైడ్‌ నోట్‌ను ఎమ్మెల్యే, పోలీసులు కనుమరుగు చేసేశారు. మరోనోట్‌ను మృతుడు ఇంటిలో పెట్టడం ద్వారా అసలు విషయం బయటపడింది. అతని చావుకు ఎంఐఎం, పోలీసులే కారణమని స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. 

Wednesday, February 15, 2012

రాష్ట్ర బడ్జెట్‌లో గ్రేటర్‌కు ప్రత్యేక వాటా కల్పించాలి

ఆదాయంలో పది శాతం నిధులు ఖర్చుచేయాలి 
సిపిఎం రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
                ఈనెల 17న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌కు సముచిత న్యాయం కల్పించాలని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో నగర కార్యదర్శి వర్గ సభ్యులు  సోమయ్య అధ్యక్షతన మంగళవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో పదిశాతం నిధులను గ్రేటర్‌ అభివృద్ధికి ఖర్చుచేయాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశానికి ముఖ్య అథితిగా హజరైన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి. సాగర్‌ మాట్లాడుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కాజేస్తోందని, స్థానిక సంస్థల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. మెట్రో వాటర్‌బోర్డుకు ప్రభుత్వం నిధులు కేటాయించకుండా నీటి బిల్లులు పెంచి ప్రజలపై భారాలు మోపిందని అన్నారు. అభివృద్ధికి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. మౌలిక వసతులు కల్పించకుండా పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాజధాని అభివృద్ధి అయితేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చెప్పారు. రాజీవ్‌ ఆవాస్‌ యోజన పేరుతో నగరంలోని 270 బస్తీలను శివారు ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తెలిపారు. గ్రేటర్‌ బడ్జెట్‌లో 40శాతం నిధులను మురికివాడల అభివృద్ధికి కేటాయించాలని, దళితులకు 16 శాతం, గిరిజనులకు 8శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాస్‌ మాట్లాడుతూ గ్రేటర్‌ హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామన్న ప్రచారమే తప్ప పనులు చేయడంలేదని విమర్శించారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకానికి నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్తోందని, కానీ ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని అన్నారు. 2010లో ప్రవేశపెట్టిన రాజీవ్‌ ఆవాస్‌ యోజన పథకానికి ఇంత వరకూ నిధులు కేటాయించలేదని చెప్పారు. గ్రేటర్‌లో జనాభాతో పాటు పన్నుల భారాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. గ్రేటర్‌లో ప్రజలకు రోజుకు 430 ఎంజిడిల తాగునీరు అవసరమైతే 345 ఎంజిడిల నీరు మాత్రమే సరఫరాచేస్తున్నారని, దీంతో కొన్ని కాలనీల్లో వారానికో సారి తాగునీరు వస్తోందన్నారు. నగరంలో తాగునీటి కొరత తీర్చడానిక,ి గోదావరి జలాలను తీసుకురావడానికి సుజల స్రవంతి పథకానికి రూ.3375కోట్లు కావాలని అంచనా వేశారని, నిధుల్లేక పనులు నిలిచిపోయాయని గుర్తుచేశారు. 2011-12 బడ్జెట్‌లో వాటర్‌బోర్డుకు రూ.434కోట్లు కేటాయించి రూ.212కోట్లు మాత్రమే ఇచ్చారని, దీంతో వాటర్‌ బోర్డు అప్పుల్లో కూరుకుపోయిందని వివరించారు. గ్రేటర్‌ నుండి రాష్ట్ర రెవెన్యూ ఆదాయంలో 38 శాతం, జిఎస్‌డిపిలో 16శాతం ఆదాయం వస్తున్నా బడ్జెట్‌లో మాత్రమే ప్రత్యేక వాటా కల్పించడంలేదని అన్నారు. ఎంఎంటిఎస్‌-2 దశకు నిధులు కేటాయింపుకు పరిమితమయ్యారే తప్ప పనులు ప్రారంభం కాలేదని చెప్పారు.