Monday, April 18, 2011

ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధం కావాలి ...మాజీ ఎంపి పి.మధు

             సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధం కావాలని మాజీ ఎంపి పి.మధు ప్రజలకు పిలుపునిచ్చారు. జిహెచ్‌ఆర్‌ఎఫ్‌, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కాప్రాలోని ( హైదరాబాద్ ) గాంధీ నగర్‌ నుంచి పాదయాత్రను ఆదివారం ప్రారంభించారు. పాదయాత్రలో ప్రజలు పలు సమస్యలను నాయకుల దృష్టికి తెచ్చారు. గాంధీనగర్‌ ఎస్‌సి బస్తీకి చెందిన శ్మశాన వాటికకు దారి లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ కాలనీ మాజీ అధ్యక్షులు ఆగయ్య నాయకుల దృష్టికి తెచ్చారు. పురాతన కాలంనాటి శ్మశాన వాటిక ఉన్న రోడ్డు సౌకర్యం లేదని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, భూస్వాములు, పాత కాలంనాటి బాట సైతం కబ్జా చేశారని తెలిపారు. తాగడానికి, వాడుకోవడానికి నీరులేక ఇబ్బందులకు గురౌతున్నామని, 4 రోజులకోసారి నీరు సరఫరా అవుతుందని తెలిపారు. డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్‌ పై మూతలు లేవని బస్తీ వాసులు తెలిపారు. కాప్రా ఎస్టీ బస్తీ, ఎల్లారెడ్డిగూడ, వంపుగూడ, సాయిబాబానగర్‌, సాయిరాంనగర్‌, బిజెఆర్‌ నగర్‌, జమ్మిగడ్డ, బిఎన్‌రెడ్డి నగర్‌, పూకట్‌ నగర్‌, చర్లపల్లి, భరత్‌నగర్‌లో పాదయాత్ర సాగింది. అనేక బస్తీల్లోను నీటి సమస్య తీవ్రంగా ఉందని అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని వంపుగూడ, న్యూ ఇందిరానగర్‌, సాయిబాబానగర్‌, చర్లపల్లి, బస్తీ ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. వెంటనే వాటర్‌ వర్క్స్‌ అధికారులతో చర్చించి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని, లేకుంటే ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. రేషన్‌ కార్డులు, పింఛన్ల కోసం రచ్చబండలో దరఖాస్తులు తీసుకొని నేటికీ పట్టించుకోలేదని హామీలకే పరిమితం అమయ్యారని మహిళలు ఆయన దృష్టికి తేగా, పాదయాత్ర ముగిసిన తర్వాత ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో మధుకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ బస్తీ వాసులు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధం కావాలని, అప్పడే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఆర్‌ఎఫ్‌ నగర కార్యదర్శి సహదేవ్‌, నాయకులు చంద్రశేఖర్‌, జిహెచ్‌ఆర్‌ఎఫ్‌ కాప్రా కార్యదర్శి శ్రీనివాసులు, డివైఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు బాబురావు, నర్సింగ్‌రావు, చేతి వృత్తిదారుల సంఘం నాయకులు శ్రీరాములు, నారాయణ, ప్రజానాట్య మండలి కళాకారులు, ఎం.శ్రీనివాస్‌, కార్తీక్‌, కాంతారావు, కనకయ్య, మారన్న, భాస్కర్‌, ప్రసాద్‌, దేవి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment