Monday, September 2, 2013

ధరల పెంపుపై సిపిఎం నిరసన... cpi(m) hyd

ధరల పెంపుపై సిపిఎం నిరసన
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

        సరళీకరణ ఆర్థిక విధానాలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భజన చేస్తున్నారని సిపిఎం విమర్శించింది. అందువల్లే దేశంలో ఎక్కడా లేనంతగా పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రంలో పన్నులు విధించారంది. తక్షణం వీటిని తగ్గించటం ద్వారా వాహనదారులకు ఉపశమనాన్ని కలిగించాలని డిమాండ్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచటాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యాన ఆదివారం హైదరాబాద్‌లోని ఎంబి భవన్‌ నుండి ఆర్టీసి క్రాస్‌రోడ్స్‌ వరకు 'యుపిఎ ప్రభుత్వ దిష్టిబొమ్మ'తో ప్రదర్శన నిర్వహించి, దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు పి.మధు మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తుల ధరలను కేంద్ర ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా పెంచటంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రూ.35 వ్యాట్‌, ఇతర పన్నుల రూపంలో బాదుతోందని అన్నారు. దీనివల్ల మరే ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయని తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న దివాళాకోరు ఆర్థిక విధానాల వల్ల డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.44 నుండి రూ.69కి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఐలపై పూర్తిగా ఆధారపడటమే ప్రస్తుత దుస్థితికి ప్రధాన కారణమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై విధించిన పన్నులను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఇతర రాజకీయ పక్షాలను కులుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావుతోపాటు పార్టీ నగర నాయకులు, సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఐద్వా తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.