Tuesday, January 28, 2014

విభజన పేరుతో ప్రజా సమస్యలు పక్కదారి...CPI(M)

- సబ్సిడీలు ఎత్తేయాలనడం రాష్ట్రపతికి తగదు
- సిపిఎం రిలే పాదయాత్రలో రాఘవులు
    సమైక్య, విభజన ఆందోళనలంటూ ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నారని, ప్రజలు అనేక ఇబ్బందులో సతమతమౌతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రిలే పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌ ఇసిఐఎల్‌ చౌరస్తాలో సిపిఎం గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో రిలే పాదయాత్రలను ఆయన ప్రారంభించారు. ప్రారంభ సభలో రాఘవులు మాట్లాడుతూ.. పేదలకు 2 రూపాయలకు కిలో బియ్యం, రైతులకు ఉచిత విద్యుత్‌, గ్యాస్‌ సబ్సీడీ వంటివి ఎత్తేయాలని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొనడం తగదన్నారు. ప్రజలకు సబ్సిడీ ఎత్తివేసి ధనికులకు రూ.5 లక్షల కోట్ల రాయితీలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలను దశలవారీగా తొలగించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రస్తుతం గ్యాస్‌కు రూ.1300 వసూలు చేసి, రకరకాల నిబంధనలు విధించి ప్రజలను, మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పేదలకు ఇవ్వడానికి ఇళ్ల స్థలాలు లేవని చెబుతున్న ప్రభుత్వం.. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు వేలాది ఎకరాలను ఆక్రమించుకుంటే వాటిని రెగ్యులైజ్‌ చేస్తున్నారని అన్నారు. రాయితీని తమ హక్కుగా కాపాడుకునేందుకు పేదలు, రైతులు పోరాటాలకు ముందుకు రావాలని కోరారు. ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ విద్యుత్‌ ఛార్జీల తగ్గింపు, మంచినీటిని ఉచితంగా అందిస్తామని చెప్పడం వల్లే ప్రజలు అధికారం కట్టాబెట్టారన్నారు. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించి, ప్రజలకు మంచినీరు ఉచితంగా అందించాలని సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో సాధ్యమౌతున్న పనులు.. మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కావని ప్రశ్నించారు. ఇతర పార్టీలు కూడా తమ అభిప్రాయాలను ప్రజలకు తెలియపరచాలని డిమాండ్‌ చేశారు. సమైక్య, విభజనపై కాంగ్రెస్‌, టిడిపిలు ఎటూ తేల్చుకోలేక ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. మొదట్నుంచి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని సిపిఎం చెప్పిందన్నారు. అసెంబ్లీకి బిల్లు వచ్చిన తరువాత చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. ఇప్పుడు బిల్లును తిరిగి పంపించాలని సూచించడం చూస్తుంటే.. అధిష్టాన నిర్ణయం మేరకే సిఎం వ్యవహరిస్తున్నట్లు అర్థమౌతోందన్నారు. ఫిబ్రవరి 4న ఐఆర్‌సిని ముట్టడిస్తామని, ప్రజలందరూ పాల్గొనాలని అన్నారు.
              ఈ కార్యక్రమంలో సిపిఎం ఉప్పల్‌ జోన్‌ కార్యదర్శి జే.చంద్రశేఖర్‌, నగర కార్యదర్శవర్గ సభ్యులు జి.యాదగిరి రావు, ఎం.శ్రీనివాస్‌, ఆదినారాయణ, నర్సింహ్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
   ( ప్రజాశక్తి పత్రిక సౌజన్యం తో...  )