Tuesday, April 19, 2011

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై బస్తీల్లో సిపిఎం పాదయాత్రలు

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై బస్తీల్లో సిపిఎం పాదయాత్రలు చేపడుతోందని మాజీ ఎంపి పి.మధు అన్నారు. ఎల్బీనగర్‌ జోన్‌ ( హైదరాబాద్ ) పరిధిలోని ఫతుల్లాగూడ, జైపురికాలనీ, బ్లైండ్‌కాలనీ, వడ్డెరబస్తీ, నువ్వులబండ తదితర కాలనీల్లో సిపిఎం నిర్వహిస్తున్న పాదయాత్రలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫతుల్లాగూడలోని గుడిసవాసులకు వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, 166 జిఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కర్మన్‌ఘాట్‌ డివిజన్‌లోని గుంటి జంగయ్య కాలనీలోని ప్రజలు చాలాకాలంగా డ్రెయినేజీ, రోడ్లు సరిగా లేక అవస్తలు పడుతున్నారని, ఈ విషయం ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధికార యంత్రాంగంలో కదలిక లేదని విమర్శించారు. రాజీవ్‌ ఆవాస్‌ యోజన పథకం కింద మురికివాడలు లేని నగరంగా మారుస్తామని, మురికివాడల అభివృద్ధిని వదిలేసి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ ప్రయత్నాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 2007లో ఇంటింటికి ఇందిరమ్మ సర్వేలో గుర్తించిన లబ్ధిదారులకు వెంటనే గుర్తింపు కార్డులు ఇచ్చి ఇళ్లు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌, చంద్రమోహన్‌, కొండల్‌గౌడ్‌, ఎల్లయ్య, రాములు, యాదయ్య, కృష్ణారెడ్డి, సుమిత్ర, ముత్తమ్మ, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment