Sunday, April 3, 2011

నగరంలో విద్యుత్‌ ఛార్జీలపెంపుపై నిరసనల వెల్లువ

విద్యుత్‌ ఛార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ నగరవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారంనాడు సిపిఎం ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. లాంతర్లతో వినూత్న ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఐక్యపోరాటాలు చేపడుతామని నాయకులు హెచ్చరించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రకమిటీ సభ్యులు పి.మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సారంపల్లి మల్లారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, నగర కమిటీ నాయకులు, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, జిహెచ్‌ఆర్‌ఎఫ్‌, ఆవాజ్‌, పట్టణ పౌర సంఘాల సమాఖ్య, రజకసంఘం, మత్స్యకార్మిక సంఘం, తదితర ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలు లాంతర్లు, దీపాలు చేతబట్టి ప్రదర్శిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బినగర్‌, రాజేంద్రనగర్‌, ఛత్రినాక, బార్కస్‌, ఇసిఐఎల్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌, కుత్భుల్లాపూర్‌, షాపూర్‌నగర్‌, గండిమైసమ్మ చౌరస్తాతోపాటు నగర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి.

No comments:

Post a Comment