Sunday, April 24, 2011

హైదరాబాద్ లో స్థానిక సమస్యలపై సిపిఎం పోరు

హైదరాబాద్ లో స్థానిక సమస్యలపై సిపిఎం పోరు  ప్రారంభించారు. కడప ఉప ఎన్నికల్లో మంత్రులు బిజీగా ఉన్నారు. ప్రజాసమస్యలు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన కార్పొరేటర్లు తమ వ్యక్తిగత లబ్ధికోసం పాకులాడుతున్నారు. వారికి ల్యాప్‌ట్యాపులు, మెడికల్‌ రీయింబర్స్‌మెంటు, విదేశీ ప్రయాణాలపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై కరువైంది. అధికారుల్లో అలసత్వం అలుముకుంది. ఈ నేపథ్యంలో నగరంలో స్థానిక సమస్యలపై సిపిఎం పోరు తలపెట్టింది. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా కార్యకర్తలు, నాయకులు పాదయాత్రలు చేపట్టారు. మంచినీటి సరఫరా, డ్రెయినేజీ, సివరేజీ, రోడ్లు, వీధిలైట్లు, పింఛన్లు, రేషన్‌కార్డులు, పొదుపు సంఘాల మహిళలకు గ్యాస్‌కనెక్షన్‌ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
                   ఏప్రిల్‌ 15 నుంచి 150 డివిజన్లలో సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్రలు ప్రారంభించారు. కార్యకర్తలు దళాలుగా ఏర్పడి బస్తీల్లో ఇంటింటికీ తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను తమ ఇంటిముందుకు వచ్చి సిపిఎం నాయకులు అడిగి తెలుసుకుంటున్నారని నగరవాసులు చర్చించుకుంటున్నారు. దీంతో ప్రజల నుంచి పాదయాత్రలకు మంచి స్పందన లభిస్తోంది. నాయకులు సమస్యలు తెలుసుకోవడంతో పాటు స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వినతి పత్రాలిచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అధికారుల్లో కొంత మేర చలనం వచ్చి ఆయా ప్రాంతాల్లో కొన్ని సమస్యలు పరిష్కరించారు.

No comments:

Post a Comment