Monday, April 16, 2012

ప్రభుత్వ చేతకానితనం వల్లే...



  • హైదరాబాద్‌లో అల్లర్లపై శాంతిర్యాలీలో మాజీ ఎంపి మధు
ప్రభుత్వ చేతగానితనం వల్లే హైదరాబాద్‌లోని మాదన్నపేట, సైదాబాద్‌లో అల్లర్లు చెలరేగాయనీ, ఆ ఘర్షణలకు సంబంధించి న్యాయవిచారణ జరిపించాలనీ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి.మధు అన్నారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో అబిడ్స్‌ చౌరస్తాలో ఆదివారం (15.04.12) నిర్వహించిన శాంతి ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని మతోన్మాద శక్తులు ఇంటికి నాలుగొందల రూపాయల చొప్పున పంచి అల్లర్లకు కారణమయ్యాయన్నారు. దాడుల్లో సామాన్యులే గాయపడ్డారని తెలిపారు. శాంతి భద్రతల విషయాన్ని పోలీసులకే వదిలేయకూడదని, రాజకీయంగా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని, అప్పుడే మత ఘర్షణలు అదుపు చేయడం సులభమవుతుందని తెలిపారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా కొన్ని మతోన్మాద శక్తులు సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలొచ్చాయన్నారు. మతోన్మాద ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయో? వీటిని ఎవరు ప్రోత్సహిస్తున్నారో వెంటనే న్యాయవిచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఘర్షణకు కారణమైన వారిని వదిలేసి, వాటితో ఎలాంటి సంబంధమూ లేనివారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మక్కా మసీదు బాంబుపేలుడు సంఘటనలో అసలు నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించి ఉంటే ఈ ఘటనలు జరిగేవి కావనీ, ఇవి జరగకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అదుపు చేయాలనీ అన్నారు. సంగారెడ్డిలో ఘర్షణలను అదుపు చేయకపోవడం వల్లే హైదరాబాద్‌లోనూ మతోన్మాదులు రెచ్చిపోయారన్నారు. ఘర్షణలపై న్యాయవిచారణ జరిపి వాస్తవాలు బయటికి తీయాలన్నారు.
          ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు జె.వెంకటేష్‌, ఎం.శ్రీనివాస్‌, ఎస్‌.నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment