Saturday, April 21, 2012

సర్‌ఛార్జీ వసూళ్లు ఆపాలి

  • ఇ-సేవా కమిషనర్‌ కార్యాలయం ఎదుట సిపిఎం ధర్నా
ఇ-సేవాలో సర్‌ఛార్జీల వసూళ్లను ఆపాలని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇ-సేవా కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇ-సేవా కేంద్రాల్లో విద్యుత్‌ బిల్లులపై యూజర్‌ ఛార్జీల పేరుతో రూ.2 నుంచి రూ.25 వరకు అదనపు భారం వేస్తున్నారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మెజార్టీ వినియోగదారుల దగ్గర ప్రతి బిల్లుపై రూ.5, రూ.10 వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. పెంచిన ఛార్జీలతో నగరంలో మార్చిలోనే రూ.45లక్షల భారం పడిందని అన్నారు. అప్పటికే వివిధ రకాల ఛార్జీలు, ధరలు పెరిగి ఆందోళన చెందుతున్న ప్రజలపై అదనంగా యూజర్‌ ఛార్జీల వసూలుకు అనుమతించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రతి బిల్లుపై విద్యుత్‌ శాఖ నుంచి ఛార్జీ వసూలు చేస్తూనే తిరిగి ప్రజలపై భారాలు మోపడం సమంజసం కాదని చెప్పారు. ప్రస్తుతం విద్యుత్‌ బిల్లులపైనే యూజర్‌ ఛార్జీ వసూలు చేస్తున్నా భవిష్యత్‌లో అన్ని బిల్లులపైనా ఆ భారం వేసే ప్రమాదముందని తెలిపారు. కొత్తగా విధించిన యూజర్‌ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని సిపిఎం నగర కమిటీ డిమాండ్‌ చేస్తోందన్నారు. ఇప్పటికే నగరంలోని సామాన్య, మధ్య తరగతి ప్రజలు నీటి ఛార్జీలు, అస్తిపన్ను, విద్యుత్‌ ఛార్జీల పెంపుతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారన్నారు. ప్రజలపై ఇ-సేవా వేస్తున్న సర్‌ ఛార్జీల మోత సామాన్యులకు భారమేనన్నారు. 


                    'ఐదు, పది రూపాయలూ ఓ భారమేనా?' అని అధికారులు, పాలకులు తేలిగ్గా తీసుకుంటున్నారని విమర్శిం చారు. 'ఏ శాఖకు ఆశాఖ ఇ-సేవకు44లో ఛార్జీ చెల్లిస్తున్నప్పటికీ తిరిగి ప్రజలపై భారాలు మోపేందుకు ప్రభుత్వం అనుమతించడం అవసరమా?' అని ప్రశ్నించారు. ఇ-సేవాలో యూజర్‌ ఛార్జీలు వసూలు చేయాలని విడుదల చేసిన జిఒ నెంబర్‌ 31ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
                అనంతరం ఎం శ్రీనివాస్‌, ఎన్‌ సోమయ్య, ఎస్‌ సహదేవ్‌, ఎం వెంకటేశ్‌, ఇ-సేవా డిప్యూటీ డైరెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు ఆదినారాయణ, విఠల్‌, సిఐటియు నాయకులు అజరుబాబు, కిరణ్‌, కెవిపిఎస్‌ నగర కార్యదర్శి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment