Wednesday, February 15, 2012

రాష్ట్ర బడ్జెట్‌లో గ్రేటర్‌కు ప్రత్యేక వాటా కల్పించాలి

ఆదాయంలో పది శాతం నిధులు ఖర్చుచేయాలి 
సిపిఎం రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
                ఈనెల 17న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌కు సముచిత న్యాయం కల్పించాలని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో నగర కార్యదర్శి వర్గ సభ్యులు  సోమయ్య అధ్యక్షతన మంగళవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో పదిశాతం నిధులను గ్రేటర్‌ అభివృద్ధికి ఖర్చుచేయాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశానికి ముఖ్య అథితిగా హజరైన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి. సాగర్‌ మాట్లాడుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కాజేస్తోందని, స్థానిక సంస్థల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. మెట్రో వాటర్‌బోర్డుకు ప్రభుత్వం నిధులు కేటాయించకుండా నీటి బిల్లులు పెంచి ప్రజలపై భారాలు మోపిందని అన్నారు. అభివృద్ధికి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. మౌలిక వసతులు కల్పించకుండా పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాజధాని అభివృద్ధి అయితేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చెప్పారు. రాజీవ్‌ ఆవాస్‌ యోజన పేరుతో నగరంలోని 270 బస్తీలను శివారు ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తెలిపారు. గ్రేటర్‌ బడ్జెట్‌లో 40శాతం నిధులను మురికివాడల అభివృద్ధికి కేటాయించాలని, దళితులకు 16 శాతం, గిరిజనులకు 8శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాస్‌ మాట్లాడుతూ గ్రేటర్‌ హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామన్న ప్రచారమే తప్ప పనులు చేయడంలేదని విమర్శించారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకానికి నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్తోందని, కానీ ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని అన్నారు. 2010లో ప్రవేశపెట్టిన రాజీవ్‌ ఆవాస్‌ యోజన పథకానికి ఇంత వరకూ నిధులు కేటాయించలేదని చెప్పారు. గ్రేటర్‌లో జనాభాతో పాటు పన్నుల భారాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. గ్రేటర్‌లో ప్రజలకు రోజుకు 430 ఎంజిడిల తాగునీరు అవసరమైతే 345 ఎంజిడిల నీరు మాత్రమే సరఫరాచేస్తున్నారని, దీంతో కొన్ని కాలనీల్లో వారానికో సారి తాగునీరు వస్తోందన్నారు. నగరంలో తాగునీటి కొరత తీర్చడానిక,ి గోదావరి జలాలను తీసుకురావడానికి సుజల స్రవంతి పథకానికి రూ.3375కోట్లు కావాలని అంచనా వేశారని, నిధుల్లేక పనులు నిలిచిపోయాయని గుర్తుచేశారు. 2011-12 బడ్జెట్‌లో వాటర్‌బోర్డుకు రూ.434కోట్లు కేటాయించి రూ.212కోట్లు మాత్రమే ఇచ్చారని, దీంతో వాటర్‌ బోర్డు అప్పుల్లో కూరుకుపోయిందని వివరించారు. గ్రేటర్‌ నుండి రాష్ట్ర రెవెన్యూ ఆదాయంలో 38 శాతం, జిఎస్‌డిపిలో 16శాతం ఆదాయం వస్తున్నా బడ్జెట్‌లో మాత్రమే ప్రత్యేక వాటా కల్పించడంలేదని అన్నారు. ఎంఎంటిఎస్‌-2 దశకు నిధులు కేటాయింపుకు పరిమితమయ్యారే తప్ప పనులు ప్రారంభం కాలేదని చెప్పారు. 

                   సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి జె.వెంకటేష్‌ మాట్లాడుతూ గ్రేటర్‌లో పరిధి దాటి పన్నులు వస్తున్నారని, 16వేల అసంఘటితరంగ కార్మికుల నుండి వృత్తి పన్ను వసూలు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. మెట్రో పనుల వల్ల ఎక్కడపడితే అక్కడ రోడ్లు తవ్వారని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారని తెలిపారు. పన్నుల వసూళ్ల కోసం స్పెషల్‌డ్రైవ్‌ చేస్తున్నారు తప్ప అభివృద్ధి కోసం కాదని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌ కేటాయించినప్పుడే కాకుండా మధ్యంతరంగా సమీక్షించుకోవాలని సూచించారు. సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గసభ్యులు హరిప్రసాద్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌కు 60లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని సిఎం గొప్పలు చెబుతున్నారని, మౌలిక వసతులు లేకుండా పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించలేని ప్రభుత్వం పరిశ్రమలకు ఎలా కల్పిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు షరతుల్లేకుండా అమలు కావడంలేదని, వాటి పర్యావసానమే ప్రజలపై భారాలువేస్తున్నారని తెలిపారు.
            డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఎ విజరుకుమార్‌ మాట్లాడుతూ 100రోజుల ప్రణాళికలో భాగంగా నిధులు కేటాయిస్తున్నామని చెబుతున్నా అభివృద్ధి పనులు జరగడం లేదని అన్నారు. 15లక్షల ఉద్యోగాలిస్తామని చెబుతున్న సిఎం హైదరాబాద్‌లో మౌలిక వసతులు కల్పించడకుండా ఉపాధి ఎలా వస్తుందని ప్రశ్నించారు. నగర ఉపాధి సంస్థ పేరుకే ఉందని చెప్పారు. జిమ్‌, క్రీడాసామాగ్రి ఇంత వరకూ ఇవ్వలేదని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి మల్లేష్‌ మాట్లాడుతూ గ్రేటర్‌లో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో మౌలిక వసతులు కరువయ్యాయని, వాటికోసం నిధులు కేటాయించాలని డిమాండ్‌చేశారు.
                ఈ కార్యక్రమంలో  సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జె.చంద్రశేఖర్‌, ఎం. శ్రీనివాస్‌రావు, నగర కమిటి సభ్యులు సహదేవ్‌, దశరథ్‌, యుఎ.నారాయణ, నాయకులు సంపత్‌, మీనా , హేందర్‌,  జె.కుమారస్వామి,  నాగేశ్వర్‌రావు, కనకయ్య,ఆర్‌.సైదులు,  నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment