Tuesday, February 21, 2012

ప్రజాస్వామ్యం ఖూనీ....

మధుపై ఎంఐఎం దాడి, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స


                         పాతబస్తీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఓ మృతుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి మధుతో పాటు నగర నాయకులు ఎం శ్రీనివాస్‌పై పోలీసుల సమక్షంలోనే మజ్లిస్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, కార్పొరేటర్‌ వాజీద్‌లు తమ అనుయాయులతో భౌతిక దాడికి దిగారు. ఈ దాడిలో మధు, ఎం శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురు సిపిఎం స్థానిక నాయకులు గాయపడ్డారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఎంఐఎం నేతలు దాడికి పాల్పడడం ద్వారా తమ నిజస్వరూపాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. పాతబస్తీ తమ జాగీరుగా భావించే మజ్లిస్‌, ఇతర పార్టీలు పాతబస్తీలో ప్రవేశించడం సహించలేక పోతోంది. సిపిఎంపై గతంలోనూ పాతబస్తీలో మజ్లిస్‌ గూండాలు దాడులు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే పరామర్శకు పోయినపుడు దాడికి పాల్పడిన సందర్భం చూస్తుంటే ఎంఐఎం దుర్మార్గం ఏ పాటిదో అర్థమవుతోంది. 

                      40ఏళ్లుగా పాతబస్తీ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ ప్రజా సమస్యలను పట్టించుకున్న దాఖలాల్లేవు. మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి అక్రమార్జనతో కోట్లు గడించిన నాయకులు రౌడీయిజం, గూండాయిజం ద్వారా రాజ్యమేలుతున్నారు. ఆ పార్టీని ఎదిరించిన యువతపై తప్పుడు కేసులు బనాయించడం, రౌడీషీట్లు తెరిపించడం, yదురించిన వారిని అణిచివేసే చర్యలకు పాల్పడడం ఆనవాయితీగా మారింది. 


        మృతుడు  సూసైడ్‌ నోట్‌లో రాశాడు. అయితే ఆ సూసైడ్‌ నోట్‌ను ఎమ్మెల్యే, పోలీసులు కనుమరుగు చేసేశారు. మరోనోట్‌ను మృతుడు ఇంటిలో పెట్టడం ద్వారా అసలు విషయం బయటపడింది. అతని చావుకు ఎంఐఎం, పోలీసులే కారణమని స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. 


మధుపై దాడి అమానుషం 

ఎంఐఎం ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

              సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి మధుపై దాడికి నిరసనగా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ హమీద్‌ ఖాన్‌ దిష్టిబొమ్మను సోమవారం సిపిఎం నగర కమిటీ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరావు మాట్లాడుతూ ఎంఐఎం ఎమ్మెల్యేను, ఆయన అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పాతనగరంలో పోలీసుల వేధింపులు తాళలేక హఖిల్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. వీరి కుటుంబసభ్యులను పరామర్శించడానికి పి మధు, నగర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం శ్రీనివాస్‌, హమాలీ సంఘం నాయకుడు రాములు వెళ్లారని తెలిపారు. అయితే వీరిపై యాఖుత్‌పురా ఎమ్మెల్యే హమీద్‌ ఖాన్‌, చంచలం కార్పొరేటర్‌ వజీర్‌ అలీ, వారి అనుచరులు, ఎంఐఎం కార్యకర్తలు సిపిఎం నేతలపై అకారణంగా దాడి చేయడాన్ని తప్పుబట్టారు. ఇంత జరిగినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం శోచనీయమన్నారు. ఎంఐఎం పార్టీకి, ప్రజాప్రతినిధులకు ప్రజాస్వామ్యంపై ఏమాత్రమూ విశ్వాసం లేదని విమర్శించారు. పాతబస్తీ అంటే తమ జాగీరుగా ఎంఐఎం నాయకులు భావిస్తున్నారని తెలిపారు. సిపిఎం ప్రభావం పెరిగితే తాము అనుసరిస్తున్న అప్రజాస్వామిక చర్యలకు చెల్లు చీటి పాడాల్సి వస్తుందని ఏదో ఒక రూపంలో ఎంఐఎం సిపిఎంను అడ్డుకుంటోందని చెప్పారు. మైనార్టీలకోసం నిరంతరం పోరాడుతున్న సిపిఎంను అడ్డుకోవడం అవివేకమన్నారు.
                గతంలో వామపక్షాలు పాతబస్తీలో మతసామరస్యం కోసం కృషిచేశాయని, దీంతో అక్కడ వామపక్షాల ప్రాతినిధ్యం వస్తుందేమోనని భయపడి మెజార్టీ పార్టీ అయిన సిపిఎంను ఎంఐఎం లక్ష్యంగా ఎంచుకుని దాడులకు పాల్పడుతోందని వివరించారు. ఎంఐఎం నాయకత్వం ఈ పద్ధతిని మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు, నగర కార్యదర్శి పిఎస్‌ఎన్‌ మూర్తి, నగర కార్యదర్శి వర్గ సభ్యుడు జె వెంకటేశ్‌, ఎన్‌ సోమయ్య, ఎస్‌ సహాదేవ్‌, ముషీరాబాద్‌ జోన్‌ కార్యదర్శి దశరథ్‌, నగర నాయకులు జి నాగేశ్వర్‌రావు, కామేశ్‌బాబు, కె ఈశ్వర్‌రావు, రాజేశం, జి నరేష్‌ కమలాకర్‌, అరుణజ్యోతి పాల్గొన్నారు.

No comments:

Post a Comment