Sunday, January 29, 2012

పెంచిన నీటి ఛార్జీలపై వాటర్‌ బోర్డు ముట్టడి


  • స్వల్ప లాఠీఛార్జి బ నాయకుల అరెస్టు
  • వారంలోగా ఛార్జీలు తగ్గించాలి
  • సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మధు డిమాండ్‌
                      'మేం ఈ భారాలు మోయలేం... పెంచిన నీటి ఛార్జీలు తక్షణం తగ్గించాలి' అని నినదిస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం నగర ప్రజలు వాటర్‌బోర్డు కార్యాలయాన్ని దిగ్బంధించారు. 'నీటి ఛార్జీలు పెంచడమా... సిగ్గు సిగ్గు... ఎమ్డీ బయటికి రావాలి' అంటూ నినాదాలు చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ప్రజలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఒక పక్క వాటర్‌ బోర్డు అధికారులకు సిపిఎం నాయకులు సమస్య వివరిస్తుండగానే ఖాకీలు వారిని అరెస్టు చేయడం మొదలు పెట్టారు. తమ నాయకులను అన్యాయంగా అరెస్టు చేశారని, వెంటనే విడిచిపెట్టాలని ప్రజలు కార్యాలయం ఎదుటే రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మళ్లీ నాయకులను అరెస్టు చేస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలపై లాఠీఛార్జి చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న సుమారు వందమందికిపైగా నాయకులను అరెస్టు చేశారు. పోలీసులు మహిళలను కూడా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. అరెస్టయిన వారిలో సిపిఎం హైదరాబాద్‌ నగర కార్యదర్శి పిఎస్‌ఎన్‌ మూర్తి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి డిజి.నర్సింహారావు, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌, సోమయ్య, చంద్రశేఖర్‌, రవి, ఎం.శ్రీనివాస్‌రావు, నగర కమిటీ సభ్యులు ఉన్నారు. 
                      అంతకుముందు కార్యాలయం వద్ద ఆందోళనకారులనుద్దేశించి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి.మధు మాట్లాడుతూ పెంచిన ఛార్జీలను వారంలోగా తగ్గించాలని లేకపోతే అన్ని పార్టీలను కలుపుకొని పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వాటర్‌బోర్డు పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కొంత మంది బడాబాబులు, పెద్దపెద్ద వ్యాపార సంస్థలకు చెందిన సుమారు రూ.572 కోట్ల బకాయిలు ఉన్నాయని, వాటిని వసూలు చేయకుండా పేదలపై భారం మోపడం సిగ్గుచేటని అన్నారు. పైగా వాటర్‌ బోర్డు నష్టాల్లో ఉందని చెప్పడం దారుణమన్నారు. జిహెచ్‌ఎంసి వసూలు చేసే ఆస్తిపన్నులో 25 శాతం నిధులను వాటర్‌బోర్డుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 2009జిఓ జారీ చేసిందని వివరించారు. అప్పటి నుండి జిహెచ్‌ఎంసి నయాపైసా వాటర్‌బోర్డుకు చెల్లించడంలేదని, ప్రభుత్వం జారీ చేసిన జిఓలను ప్రభుత్వ సంస్థలే ఖాతరు చేయకుంటే సిఎం ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని, ఎవరు అడ్డొచ్చినా ప్రజా ఉద్యమాలు ఆగవని హెచ్చరించారు. నగర కార్యదర్శి పిఎస్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ తాగునీటితో వ్యాపారం చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. డిజి.నర్సింహారావు మాట్లాడుతూ ప్రపంచబ్యాంకు విధానాల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం నీటి ఛార్జీలు పెంచిందన్నారు. బస్తీలు, కాలనీల్లో ఉన్న పబ్లిక్‌ నల్లాలను ఎత్తివేసి వాటికి మీటర్లు బిగించి ప్రజలపై భారాలు మోపుతున్నారని చెప్పారు.
వాటర్‌బోర్డు సిజిఎంకు వినతి
            వాటర్‌బోర్డు సిజిఎం(రెవెన్యూ) సుందర్‌రాంరెడ్డికి సిపిఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించిన ఆయన మురికివాడల్లో నివసించేవారికి డొమెస్టిక్‌ ఛార్జీలు వేస్తామని, కమర్షియల్‌ బిల్లులు ఇస్తే వాటిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. చిన్నచిన్న షాపులకు డొమెస్టిక్‌ బిల్లులే ఇస్తామని చెప్పారు. 

No comments:

Post a Comment