Monday, January 9, 2012

నీటి ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ పోరాటాలకు సిద్ధమైన సిపిఎం

  • 12న సెక్షన్‌ కార్యాలయాల వద్ద ధర్నా
  • 17-25వరకు ఎస్‌ఎంఎస్‌, ఈ మెయిల్‌, వినతిపత్రాలు
  • 28న వాటర్‌బోర్డు ముట్టడి
  • మహాసభలో తీర్మానం
           నగరంలో జలమండలి అడ్డగోలుగా పెంచిన నీటిఛార్జీలపై సిపిఎం నగర కమిటీ పోరాటాలకు సిద్ధమైంది. పెంచిన ఛార్జీలు ఉపసంహరించే వరకూ వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. 19వ నగర మహాసభల సందర్భంగా ఈ మేరకు నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్‌ నగరవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం భోజన విరామంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నగరకమిటీ సభ్యులు ఎస్‌ సహదేవ్‌, కామేష్‌బాబు, పి గెల్వయ్య, సోమయ్య పాల్గొని చేపట్టబోయే ఉద్యమాన్ని గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మురికివాడలు సహితం వదలకుండా జలమండలి అధికారులు భారీగా నీటి ఛార్జీలు పెంచారని విమర్శించారు. స్వల్పంగానే నీటిఛార్జీలు పెంచామని చెబుతూనే అందుకు భిన్నంగా ఇష్టమొచ్చినట్లు బిల్లులు వసూలు చేస్తున్నారన్నారు. నీటిఛార్జీల బిల్లులు చూసి ప్రజలు బెంబేలెత్తి పోతున్నారన్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందన్నారు. గతం కంటే ప్రస్తుతం 150 శాతానికి పైగా అదనంగా బిల్లులు వస్తున్నాయన్నారు. ఇప్పటికే పెంచిన పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర ధరలతో నగరవాసులు అతలాకుతలం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా నష్టాల పేరుతో జలమండలి అధికారులు నీటి ఛార్జీలు పెంచడం సమంజసం కాదన్నారు. 
                 రాష్ట్ర ప్రభుత్వం బోర్డు అభివృద్ధికి ఏ మాత్రమూ నిధులు ఇవ్వడంలేదన్నారు. దీనికి తోడు వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి చెల్లించాల్సిన బిల్లులు రూ.147 కోట్ల బకాయిలున్నాయన్నారు. అదేవిధంగా ప్రయివేటు సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు, బడాబాబుల నుంచి రూ.520 కోట్ల బకాయిలు వసూలు చేయాల్సి ఉందన్నారు. ఈ బకాయిలు వసూలు చేయడంలో జలమండలి ఘోరంగా విఫలమైందన్నారు. ఆ దిశగా ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. బకాయిలు వసూలు చేయడంతో పాటు నీటి సరఫరాలో అవుతున్న 40 శాతం వృథాను నియంత్రించాలన్నారు. ప్రభుత్వం విద్యుత్‌ వినియోగంలో కమర్షియల్‌ ఛార్జీల నుంచి మినహాయింపునివ్వాలన్నారు. తదితర ప్రత్యామ్నాయాలు అనుసరిస్తే నష్టాలు లేకుండా నీటి సరఫరా చేయొచ్చన్నారు. అవి చేయడానికి చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ప్రజలపై భారాలు రుద్దడం సమంజసం కాదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెంచిన నీటిబిల్లులు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలను కూడగట్టి పెంచిన నీటిఛార్జీలకు వ్యతరేకంగా 12వ తేదీన వాటర్‌బోర్డు సెక్షన్‌ ఆఫీసుల వద్ద ధర్నాలు చేస్తామన్నారు. 17 నుంచి 25వరకు కరపత్రాల పంపిణీ చేసి ప్రజల చేత వాటర్‌బోర్డు ఎండికి ఎస్‌ఎంఎస్‌లు, ఈ మెయిల్‌, ఫేస్‌బుక్‌లో మెస్సేజ్‌లు తదితర రూపాల్లో నిరసనలు తెలుపుతామన్నారు. సంతకాల సేకరణ చేపడుతామన్నారు. అధికారులకు వినతిపత్రాలిస్తామన్నారు. అయినా స్పందించకుంటే 28న జలమండలి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

No comments:

Post a Comment