Monday, January 9, 2012

ఉద్యమాలకు సన్నద్ధం కావాలి


  • హైదరాబాద్‌ నగర 19వ మహాసభల్లో ఎస్‌ వీరయ్య
              ప్రజాసమస్యలు పరిష్కరిస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్‌పార్టీ, దాని మిత్రపక్షాలు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పూర్తిగా విఫలమయ్యాయని, పేదల సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఎం నిరంతరం పోరాటం చేస్తోందని, రాబోయేకాలం ఎర్రజెం డాదేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌. వీరయ్య అన్నారు. ముషీరాబాద్‌లోని శేఖర్‌నగర్‌ (ఖషీష్‌ ఫంక్షన్‌ హాల్‌)లో ఆదివారం నిర్వహించిన సిపిఎం హైదరాబాద్‌ నగర 19వ మహాసభలకు నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌.నర్సింహారెడ్డి, నగర నాయకులు సోమయ్య, రవి, నాగలక్ష్మి, సత్తార్‌ అధ్య క్షవర్గంగా వ్యవహరించారు. ఈ మహాసభల్లో వీరయ్య ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రాన్ని మైనార్టీ ప్రభుత్వం పాలిస్తోంది. మంత్రులు పరస్పరం ఆరో పణలు చేసుకుంటున్నారనీ చెప్పారు. తెలంగాణపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, తెలుగుదేశం తమ వైఖరి చెప్పలేదని కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం చెప్పడం శోచనీయమన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీనే వేర్పాటువాద ఆందోళనలకు కారణమన్నారు. 2014లో జరిగే ఎన్నికల దాకా కేంద్రప్రభుత్వం తెలంగాణ విషయంలో కాలయాపన చేస్తుందని అన్నారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్నది ఒక్క సిపిఎం మాత్రమేనని, రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలు, ఉద్యమాలకు ప్రజలను సమయాత్తం చేసేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు వీరయ్య పిలుపునిచ్చారు.


సంక్షోభంలో పెట్టుబడిదారీ దేశాలు
               ప్రపంచంలో ఎర్రజెండా పని అయిపోయిందని చంకలెగరేసిన పెట్టుబడిదారి దేశాలు ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో కుదేలవుతున్నాయని అన్నారు. ఒకపక్క దేశ ఆర్థిక వృద్ధిరేటు పడిపోతుంటే మరోపక్క దేశంలో ధనవంతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని తెలిపారు. అమెరికాలాంటి దేశాల సంక్షోభ ప్రభావం మన దేశంపై పడకపోవడానికి ఎల్‌ఐసి, బ్యాంకింగ్‌ రంగం కారణమన్నారు. ఆ రంగాలను కాపాడిన ఘనత వామపక్షాలదేనని, ముఖ్యంగా సిపిఎందేనని అన్నారు. అటువంటి సంస్థలను ప్రైవేటికరించాలని వాజ్‌పేయి నుండి మన్మోహన్‌సింగ్‌ దాకా ప్రయ త్నాలు చేస్తున్నారన్నారు. వాటిని ప్రైవేటీికరిస్తే 2012లో దేశం ఆర్థికంగా గడ్డుకాలం ఎదుర్కో నుందని వివరించారు. అంతకుముందు మహాసభల ప్రారంభసూచకంగా పార్టీ సీనియర్‌ నాయకులు టి.వి.చారి జెండావిష్కరణ చేశారు.
               ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీి సభ్యులు పి.మధు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌.సుధాభాస్కర్‌, టి.జ్యోతి, నగర కార్యదర్శి పిఎస్‌ఎన్‌ మూర్తి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి డి.జి.నర్సింహారావు, నగర మాజీ కార్యదర్శి రఘుపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 
    ( ప్రజాశక్తి సౌజన్యంతో.....  ) 

No comments:

Post a Comment