Tuesday, January 10, 2012

సమస్యల పరిష్కారమే సిపిఎం ఎజెండా


  • నగర కార్యదర్శిగా పిఎస్‌ఎన్‌ మూర్తి
  • 12 అంశాలపై తీర్మానాలు
  • కార్యాచరణ అమలుకు నూతన కమిటీ కంకణం
  • విజయవంతంగా ముగిసిన నగర మహాసభలు
           ప్రజాసమస్యల పరిష్కారమే సిపిఎం ఎజెండాగా 19వ నగర మహాసభల్లో నిర్ణయించారు. ఆది, సోమవారాల్లో కామ్రేడ్‌ కె శేఖర్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన నగర మహాసభలు విజయవంతంగా ముగిశాయి. సోమవారం నాడు జరిగిన సభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. నగర కార్యదర్శిగా పిఎస్‌ఎన్‌ మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగర కార్యదర్శిగా ఆయన ఏడోసారి ఎన్నికయ్యారు. 26 మందితో నూతన కమిటీని ప్రతినిధులు ఎన్నుకున్నారు. కార్యదర్శివర్గం తొమ్మిది మందితో ఎన్నికైంది. వీరితో పాటు రాష్ట్ర మహాసభలకు హాజరయ్యే ప్రతినిధులను ఎన్నుకున్నారు. సభల్లో 12 ప్రధాన అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. కేంద్రకమిటీ సభ్యులు పి మధు, రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య తదితర అగ్రనేతలు పర్యవేక్షించారు. వీరితోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌ సుధాభాస్కర్‌, టి జ్యోతి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి డిజి నరసింహారావు, మాజీ నగర కార్యదర్శి రఘుపాల్‌ తదితరులు హాజరయ్యారు. ప్రజల్లో మమేకమై ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి అగ్రనేతలు అమూల్యమైన పలుసూచనలు చేశారు. ప్రజాజీవితాన్ని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా పోరాటాలు నిర్మించాలని వారు సూచించారు. రెండు రోజులపాటు జరిగిన సభలో ప్రతినిధులంతా ఉత్సాహంగా పాల్గొనడంతోపాటు క్రమశిక్షణ పాటించారు. సభల్లో లక్ష్యాలను నిర్దేశిస్తూ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు. వర్గపోరాటాలు, నివాసప్రాంత సమస్యలపై పోరాటాలు సమన్వయం చేస్తూ ముందుకు పోవాలని నిర్ణయించారు. చివరిగా '' ఆకలిమంటలు మలమలలాడే అనాధలంతా లేవండోరు'' అంటూ అంతర్జాతీయ విప్లవ గీతంతో మహాసభలు ముగిశాయి.
నూతనకమిటీ ఎన్నిక
                  సభలో 26 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. నగర కార్యదర్శిగా పిఎస్‌ఎన్‌ మూర్తి, నగర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎం శ్రీనివాస్‌, జె వెంకటేష్‌, ఎస్‌ నరసింహారెడ్డి, ఎం శ్రీనివాసరావు, జి యాదగిరిరావు, జె చంద్రశేఖర్‌, ఎన్‌ సోమయ్య, కె రవి ఎన్నికయ్యారు. నగర కమిటీ సభ్యులుగా ఎస్‌ సహదేవ్‌, కె ఈశ్వరరావు, జి నాగేశ్వరరావు, వి కామేష్‌ బాబు, పి గెల్వయ్య, ఎం చంద్రమోహన్‌, కె ఎన్‌ రాజన్న, యు ఎ నారాయణ, ఎన్‌ శ్రీనివాస్‌, సి అరుణ, సిహెచ్‌ లీలావతి, అష్రప్‌ అలీ, ఎం దశరథ్‌, జి విఠల్‌, ఎం వెంకటేష్‌, ఎం ధర్మానాయక్‌, పి నాగేశ్వర్‌ ఎన్నికయ్యారు. గత నగర కమిటీలో ఉన్న సత్తిరెడ్డి బాధ్యతల నుంచి వైదొలిగారు. కమిటీలో ఎం దశరథ్‌, జి విఠల్‌, ఎం వెంకటేష్‌, ఎం ధర్మానాయక్‌, పి నాగేశ్వర్‌ నూతనంగా సభ్యులుగా ఎన్నికయ్యారు. అదేవిధంగా కార్యదర్శివర్గంలో కొత్తగా ఎన్‌ సోమయ్య, కె.రవికి చోటు దక్కింది. ఇతర సభ్యులు పాతవారే తిరిగి ఎన్నికయ్యారు.
కార్యాచరణ అమలుకు నూతన కమిటీ కంకణం
               మహాసభల్లో రూపొందించిన భవిష్యత్తు కార్యాచరణ పటిష్టంగా అమలు చేయడమే కర్తవ్యంగా నూతన కమిటీ కంకణం కట్టుకుందని నగర కార్యదర్శి పిఎస్‌ఎన్‌ అన్నారు. వర్గపోరాటాలు, నివాస ప్రాంత పోరాటాలతో పాటు, మధ్యతరగతి ప్రజలపై కేంద్రీకరించి పోరాటాలు సమన్వయం చేస్తామన్నారు. నిర్మాణపరంగా ఉద్యమాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడానికి కావాల్సిన చర్యలు చేపడుతామన్నారు. పార్టీసభ్యత్వంతో పాటు, ప్రజాసంఘాల సభ్యత్వాన్ని పెంచుతామన్నారు. సభ్యుల సైద్ధాంతిక స్థాయిని మరింత పెంచడానికి అధ్యయన తరగతులు కొనసాగిస్తూనే మరిన్ని చర్యలు చేపడుతామని వివరించారు. మహాసభల్లో తీసుకున్న ఎజెండా, 2012 లక్ష్యాలు నెరవేర్చడానికి సన్నద్ధమౌతామని చెప్పారు. నీటిఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా తక్షణ పోరాటం ఉంటుందన్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. వీటితోపాటు రానున్న రోజుల్లో రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు కోసం ఉద్యమాలు చేస్తామన్నారు. అదేవిధంగా సభల్లో ఆమోదించిన 12 తీర్మానాలకు అనుగుణంగా పోరాటాలుంటాయన్నారు. నగరంలో సమస్యలు ప్రసావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించినా రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు. నగరంలో 3.17లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని గుర్తించిందన్నారు. స్థలాలు ఇవ్వకుండా నగర శివారుల్లో ప్రభుత్వ భూములు లేవని సిఎం దాటవేస్తున్నారని విమర్శించారు. మలక్‌పేటలో ఉన్న 130 ఎకరాల రేస్‌కోర్సును నగర శివారుల్లోకి తరలించాలని, ఆ స్థలంలో పేదలకు ఇళ్లు కట్టించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రూపాయి కిలో బియ్యం ఇచ్చిన ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూపాయి కిలో బియ్యం ఎవ్వరు అడిగారని నిత్యావసర ధరలు తగ్గించండని రచ్చబండలో ప్రశ్నించిన పేదలకు సమాధానంగా అవసరం లేని వారు రేషన్‌కార్డును ఇచ్చేయండని ముఖ్యమంత్రి అనడం సిగ్గుచేటని అన్నారు. నగరంలో విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో రాష్ట్రప్రతి ప్రతిభపాటిల్‌ వంటమనిషికే వైద్యం అందక వైద్యులపై ఫిర్యాదు చేయడమే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. ఈ దుస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. మెట్రోరైలు బాధితులకు నష్టపరిహారం అందించాలని, వారికి పునరావాసం కల్పించాకే పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఇలా నగరంలో పలు సమస్యలను ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆయా సమస్యల పరిష్కారం చేయాలని కోరారు. లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రజాశక్తి సౌజన్యంతో.....  

No comments:

Post a Comment