Friday, January 13, 2012

నీటి ఛార్జీల పెంపుపై సమరం

  • సెక్షన్‌ కార్యాలయాల వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాలు
  • కదిలివచ్చిన ప్రజానీకం
  • మంచినీటి వ్యాపారం మానుకోవాలి : సిపిఎం
             సర్కార్‌ నీటి వ్యాపారానికి వ్యతిరేకంగా సిపిఎం సమరశంఖం పూరించింది. నగరంలో పలుచోట్ల సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలకు ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. సర్కార్‌ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం మంచినీటి వ్యాపారం నుండి వైదొలగాలని డిమాండ్‌ చేశారు. మంచినీటి వ్యాపారం మానుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకే ఈ ప్రక్రియ ప్రారంభించారని, పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోకుంటే ప్రతిఘటన తప్పదని అగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన నీటి ఛార్జీలకు నిరసనగా గురువారం హైదరాబాద్‌లోని 11 జోన్లలో జలమండలి కార్యాలయాల ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముషీరాబాద్‌లో ధర్నాను సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాసరావు, ఘోషామహల్‌ దగ్గర ధర్నాలో ఎం శ్రీనివాసు, సికింద్రాబాద్‌ జోన్‌లో ఎన్‌ సోమయ్య, కాప్రా దగ్గర చంద్రశేఖర్‌, ఉప్పల్‌ కార్యాలయం దగ్గర రవి, అంబర్‌పేట్‌ కార్యాలయం వద్ద జోన్‌ కన్వీనర్‌ మహేందర్‌ మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల ప్రకారం నగర ప్రజలపై నీటి ఛార్జీల భారాల్ని మోపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఓ పక్క పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుతూ ఇప్పుడు నీటి ఛార్జీల భారాన్ని కూడా ప్రజలపై మోపిందని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇదేంటని పౌరసంఘాలు ప్రశ్నిస్తే జలమండలి నష్టాల్లో ఉందని, తప్పుడు సమాధానం చెపుతున్నారని, ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యమని అన్నారు.                                   జలమండలి నష్టాలకు మేధావులు, ప్రజాసంఘాలు పరిష్కారాన్ని సూచించాయని, అయినా పట్టించుకోకుండా భారాలు పెంచడం భావ్యం కాదన్నారు. పైపులైన్ల లీకేజీ వల్ల 40 శాతం వృథా అవుతున్న నీటిని అరికట్టడంలో జలమండలి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. జలమండలికి వివిధ ప్రభుత్వ కార్యాలయాలు సుమారు రూ.147 కోట్లు బకాయిలున్నాయని, బడా వ్యాపార, పారిశ్రామిక వేత్తల నుండి మరో రూ. 520 కోట్లు బకాయిలను వసూలు చేయలేని చేతగాని స్థితిలో జలమండలి అధికారులు ఉన్నారని విమర్శించారు. గతంలోనే ప్రభుత్వం ప్రాపర్టీ పన్నులో 25 శాతం మంచినీటి బోర్డుకు చెందుతుందనే తీర్మానాన్ని బుట్టదాఖలు చేయడాన్ని తప్పుపట్టారు. సంవత్సరానికి రూ. 600 కోట్ల రూపాయలు ఆస్తి పన్నుల రూపంలో వసూలవుతోందని, దాంట్లో నుంచే 25 శాతం వాటర్‌ బోర్డుకు కేటాయించాల్సి ఉందన్నారు. ముషీరాబాద్‌ జోన్‌ కార్యదర్శి ఎం దశరథ్‌ మాట్లాడుతూ మురికి వాడలకు కిలోలీటర్‌కు ఒక్క రూపాయి మాత్రమే పెంచామని, పేదలకు పెద్దగా భారం ఉండదని జలమండలి అధికారులు చెప్పడం కాకమ్మకథలు మాత్రమేనని అన్నారు. ఇప్పటికే బిల్లుల మోత మోగిపోతుందని, పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. 15 కిలో లీటర్ల నీటిని వాడుతున్న 3.6 లక్షల వినియోగదారులపై నెలకు రూ. 80 రూపాయల అదనపు భారం పడుతోందని అన్నారు.

                       జోన్‌ కార్యదర్శి వర్గ సభ్యులు జి నరేష్‌ మాట్లాడుతూ ప్రజలపై నీటి ఛార్జీల భారాన్ని మోపుతున్న జలమండలి ఇప్పటికైనా పెంచిన ఛార్జీలను వెనక్కు తీసుకోవాలని, లేకుంటే జలమండలి ముట్టడికి సమాయత్తం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. పెంచిన నీటి ఛార్జీలను తగ్గించకపోతే రాబోయే కాలంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు, నగర కమిటీ సభ్యులు జోన్‌ కార్యదర్శులు ముషీరాబాద్‌ జోన్‌ కార్యదర్శి వర్గ సభ్యులు పి శ్రీనివాస్‌, పి మల్లేశ్‌, సైదులు, సయ్యద్‌ ఆరిఫ్‌, విమల, నీరజ, భవాని, శ్రీదేవి, యూసఫ్‌, రాములు, యల్లయ్య, ఎస్‌ దశరథ్‌, చారీ అంబర్‌పేట్‌ నాయకులు మైసయ్య, బాలకృష్ణ, సుబ్బారావు, నారాయణ, ధన్‌రాజ్‌, వెంకటేష్‌ వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.

నీటి ఛార్జీలు తగ్గించాలి :సిపిఎం 

           పెంచిన నీటి ఛార్జీలను వెంటనే తగ్గించాలని సిపిఎం చార్మినార్‌ జోన్‌ కమిటి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు జోన్‌ కన్వీనర్‌ అబ్దుల్‌ ఖాదర్‌, పార్టీ నాయకులు మహేష్‌ దుర్గే, సిహెచ్‌ ప్రతాప్‌, శేఖర్‌లు కలిసి వాటర్‌ బోర్డు చందూలాల్‌ బారాదరి సెక్షన్‌ జనరల్‌ మేనేజర్‌కు గురువారం మెమోరండం సమర్పించారు. నీటి ఛార్జీలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆందోళన వ్యక్తం చేశారు. ఛార్జీలు తగ్గించకుంటే పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

నేరేడ్‌మెట్‌ : నీటి ఛార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం మల్కాజిగిరి జోన్‌ కార్యదర్శి ఎన్‌.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జలమండలి కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడం పక్కనబెట్టి ప్రభుత్వం పేదలపై పన్నుల భారాలేయడం సిగ్గుచేటన్నారు. అసలే పెరిగిత నిత్యావసరాల ధరలు పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయని, ఈ క్రమంలో నీటి ఛార్జీలు పెంచడం దారుణమని విమర్శించారు. రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నామని చెబుతూనే మరోపక్క పన్నుల భారాలు మోపుతున్నారన్నారు. నీటి ఛార్జీల బకాయిలు 520 కోట్లు రావాల్సుందని, కానీ ప్రభుత్వం వాటిని వసూలు చేయడంలేదని, బకాయిలను పూడ్చేందుకు పేదలపై భారాలేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో జలమండలి అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. పెంచిన ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిచో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో చల్లాలీలావతి, ఉన్నికృష్ణ, వెంకట్‌రెడ్డి, ఎం లక్ష్మణ్‌, అన్నపూర్ణమ్మ, టి నర్సమ్మ, స్వామిగౌడ్‌, ప్రభాకర్‌, మంగ పాల్గొన్నారు.
నాచారం : నీటి ఛార్జీల పెంపును వెంటనే ఎత్తేయాలని కాప్రా సిఐటియు జోన్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. ఛార్జీల పెంపును నిరసిస్తూ కాప్రా సిపిఎం ఆధ్వర్యంలో నాచారం జలమండలి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం కార్యవర్గ సభ్యులు ప్రసాద్‌, శ్రీనివాస్‌, వెంకట్‌, నర్సింగ్‌రావు, బెల్‌కార్మిక విభాగం నాయకుడు కెవి చారి, సభ్యులు దేవిరెడ్డి, జివిరావు, సఫియా, బాబురావు, శ్రీనివాస్‌, ప్రభాకర్‌, సుభాషిణి, వహిద, రుక్మిణి పాల్గొన్నారు.
మల్కాజిగిరి : నీటి ఛార్జీల పెంపును నిరసిస్తూ ఫెడరేషన్‌ ఆఫ్‌ కాలనీ అసోసియేషన్‌, అపార్టుమెంట్‌లు(ఫాకా) మల్కాజిగిరి కన్వీనర్‌ ఎం కృపాసాగర్‌ ఆధ్వర్యంలో జిఎం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆకాశమే హద్దుగా పన్నుల భారాలేస్తోందని, పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తోందని, వెంటనే ఛార్జీలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో విజరుకుమార్‌, నారాయణరెడ్డి, సత్యనారాయణ ఉన్నారు.
సైదాబాద్‌ : పెంచిన మంచినీటి ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ యాకుత్‌పురా సిపిఎం జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో సంతోష్‌నగర్‌ వాటర్‌ బోర్డు సెక్షన్‌ ఆఫీస్‌ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోటయ్య, పి దేవయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు మాటిమాటికి పెంచుతుందన్నారు. పెట్రోల్‌ ధరలు ఇప్పటికే 12 సార్లు పెంచిందని తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో, రెవెన్యూ విభాగంలో యూజర్‌ ఛార్జీలు వసూలు చేస్తుందన్నారు. దీంతో పాటు మంచినీటి ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. పెంచిన ఛార్జీలు ఉపసంహరించుకోవాలన్నారు. లేని పక్షంలో నగర వ్యాప్తంగా ప్రజలను సమీకరించి రాబోయే జలమండలి ఆఫీసును ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్‌లతీఫ్‌్‌, మినాజ్‌ఖురేషి, నగర నాయకులు కామ్రేడ్‌ జెకెశ్రీనివాస్‌, జోన్‌ నాయకులు అబ్దుల్‌ రఫీక్‌, టి సైదులు, మహ్మద్‌ ఆలీ, అయ్యద్‌ చౌదరి, ఆపీజ్‌, ఎ రాములు పాల్గొన్నారు.
ధూల్‌పేట్‌ : పెరుగుతున్న నిత్యావసరాల వస్తువులతోనే హడలిపోతున్న నగరవాసులకు ప్రభుత్వం మంచినీటి ఛార్జీలను పెంచి వారి నడ్డి విరిచిందని, వెంటనే ఛార్జీలను ఉపసంహరించాలని సిపిఎం పాతనగర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ సందర్భంగా జలమండలి డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు గురువారం వినతిపత్రం అందజేసింది. అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ మంచినీటి సరఫరాను రద్దు చేసి 50శాతం ఛార్జీలను ప్రభుత్వం ఒకే సారి మోపడం అన్యాయమన్నారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి ప్రయివేటీకరణను తక్షణంగా ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో చార్మినార్‌ జోన్‌ సిపిఎం ఇన్‌ఛార్జి అబ్దుల్‌ ఖాదర్‌, నాయకులు మహేశ్‌ దుర్గే, సిహెచ్‌ ప్రతాప్‌, శేఖర్‌ యాదవ్‌ పాల్గొన్నారు.
నీటి ఛార్జీల పెంపును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం నగర కార్యదర్శివర్డ సభ్యులు ఎం శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం గోషామహల్‌ జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో గోడేకిఖబర్‌ జలమండలి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జలమండలి అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు ఎస్‌ సహదేవ్‌, గోషామహల్‌ జోన్‌ నాయకులు పి నాగేశ్వర్‌, ఎన్‌ శ్రీరాములు, కార్యకర్తలు జి కిషన్‌, పి రాణిబాయి, సంతోషి, బి రాములు, నందుబాయి, రాజు, మోహన్‌, అయూబ్‌ ఖాన్‌ పాల్గొన్నారు.
చాంద్రాయణగుట్ట : నగరంలో మంచినీటి ఛార్జీలను భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం, జలమండలి తీసుకున్న నిర్ణయం నగర ప్రజలపై తీవ్రమైన భారం పడుతుందని సిపిఎం చాంద్రాయణగుట్ట కన్వీనర్‌ ఎం. ధర్మానాయక్‌ అన్నారు. మురికి వాడలను సహితం వదలకుండా భారీగా నీటి ఛార్జీలను పెంచడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పదిహేను కిలోల్లోపు నీటిని వాడుకున్న 3.6లక్షల వినియోగదారులపై నెలకు 80రూపాయల భారం పడిందన్నారు. అపార్ట్‌మెంట్లపై దారుణమైన భారం పడిందని, ప్రతి ప్లాట్‌కూ 121రూపాయలు చెల్లించాలనడం అన్యామని అన్నారు. అనంతరం జలమండలి మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు లక్ష్మమ్మ, రాంకుమార్‌, ఎస్‌ కిషన్‌, ఎ క్రిష్ణ, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.
మలక్‌పేట : నీటి ఛార్జీలు పెంపును ఉపసంహరించుకోవాలని సిపిఎం మలక్‌పేట నాయకులు జలమండలి అధికారులకు గురువారం మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మలక్‌పేట్‌ కన్వీనర్‌ బాలు మాట్లాడారు. మెమోరండం అందించిన వారిలో సిపిఎం కార్యకర్తలు సుందర్‌, స్వరూప, రమేష్‌, జగదీష్‌ ఉన్నారు.
దిల్‌సుఖ్‌నగర్‌ : నీటి ఛార్జీల పెంపును నిరసిస్తూ ఎన్‌టిఆర్‌నగర్‌లోని వాటర్‌ వర్క్స్‌ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌ వాసులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జలమండలి అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ధర్నాలో జోన్‌ కార్యదర్శి ఎం చంద్రమోహన్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జోన్‌ కమిటీ నాయకులు శ్రావణ్‌, మద్దిలేటి గణేష్‌, రాములు, కొండలు శ్రీనివాస్‌ రాము పాల్గొన్నారు.
ఉప్పల్‌ : ఉప్పల్‌లోని వాటర్‌ వర్క్స్‌ డిజిఎం కార్యాలయం ఎదుట జిఎం అధికారి హన్మంత రావుకు సిపిఎం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల్‌ జోన్‌ కార్యదర్శి కోమటి రవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జె వెంకన్న, కె విజరు కుమార్‌, ఎస్‌ నాగరాజు, ఆదినారాయణ, పద్మ, బి శ్రీనివాస్‌, పి గణేష్‌, ఎ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
జూబ్లిహిల్స్‌ : సిపిఎం జూబ్లిహిల్స్‌ జోన్‌ ఆధ్వర్యంలో బోరబండ ఎస్‌టిఆర్‌ హిల్స్‌ వాటర్‌ బోర్డు ఆఫీసు ఎదుట నిర్వహించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ జోన్‌ కమిటీ సభ్యులు టి సాయిశేషగిరి రావు ఆధ్వర్యంలో వాటర్‌ బోర్డు అధికారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ ధర్నా కార్యాక్రమంలో సిపిఎం కన్వీనర్‌ చంద్రశేఖర్‌ రావు, సిఐటియు నాయకులు కిరణ్‌, టిఎన్‌ఎం నాయకుడు టిఆర్‌ నాయుడు, మహిళ సంఘం నాయకురాలు సంగీత, గిరిజన సంఘం నాయకుడు శీను నాయుడు, మైనార్టీ నాయకులు నాజర్‌ ఖాన్‌, కాలనీవాసులు సత్తయ్య, శివమ్మ, చీరిబాయి, స్ఫూర్తి, దేవి, సునిత, పాల్గొన్నారు
మెహిదీపట్నం : నగరంలో భారీగా పెంచిన మంచినీటి ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం కార్వాన్‌, నాంపల్లి కమిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా గుడిమల్కాపూర్‌ శారదనగర్‌లోని హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ అండ్‌ సేవరేజ్‌ బోర్డు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సిపియం నాంపల్లి, కార్వాన్‌ జోన్‌ కమిటీల కన్వీనర్లు యం.వెంకటేష్‌, జి.విరyల్‌లు హాజరై ధర్నానుద్దేసించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం, జలమండలి నీటి ఛార్జీలు పెంచడం ద్వారా సామాన్య, మధ్య తరగతి, మురికి వాడల ప్రజలపై పెనుభారం మోపిందని మండిపడ్డారు. దేశంలోని అనేక నగరాల్లో మురికివాడల్లో ఉచితంగా, అతి తక్కువ ధరలకు నీటిని అందిస్తుంది. కానీ నగరంలో మాత్రం మురికివాడల్లో లీటరుకు ఒక రూపాయి మాత్రమే పెంచామని ఇది పేదలకు పెద్దగా భారం ఉండదని పేర్కొనడం సరికాదని వారు విమర్శించారు. జలమండలికి రావాల్సిన బకాయిలను సక్రమంగా వసూలు చేయడం లేదన్నారు. బడా వ్యాపార, పారిశ్రామిక సంస్థల నుంచి దాదాపు 520 కోట్ల బకాయిలు రావాలన్నారు. అందులో 187కోట్లు ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సి ఉందన్నారు. జిహెచ్‌ఎంసి ఆస్తిపన్నులో 25శాతం జలమండలికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 2009 లో జిఓ461 జారీ చేసినా ఇప్పటికీ ఆడబ్బు జలమండలికి అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఎద్దేవా చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జలమండల డివిజన్‌ 3 జిఎం పి.రవికి, డిప్యూటీ జిఎం నాగేంద్రకుమార్‌లకు అందజేశారు.
             ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలన్నారు. లేకపోతే భవిష్యత్‌లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈధర్నా కార్యక్రమంలో సిపియం నాంపల్లి, కార్వాన్‌ జోన్‌ కమిటీల కార్యదర్శులు బ్రోజీ శంకర్‌, సి.మల్లేష్‌ నాయకులు కళ్యాణ్‌, మహమ్మద్‌ అలీ, శంకర్‌చారీ, రాములు, రామకృష్ణ, యాదగిరి,ఎండి బషీర్‌, నహీంబారు, మహాబుబ్‌, నజీర్‌ అన్సారీ, ఎంకెనాయర్‌, రాజులు పాల్గొన్నారు. 
ప్రజాశక్తి సౌజన్యంతో.....

No comments:

Post a Comment