Monday, May 2, 2011

కార్మికుల ఐక్యతే సమస్యలకు పరిష్కారం...

             కార్మికులు ఐక్యంగా ఉంటేనే సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలుగా ఉంటుందని సిఐటియు నగర ఉపాధ్యక్షులు పిఎస్‌ఎన్‌ మూర్తి అన్నారు. మేడేను పురస్కరించుకుని గాంధీనగర్‌ డివిజన్‌లోని అశోక్‌నగర్‌లోని లేబర్‌ అడ్డా, గాంధీనగర్‌ చౌరస్తా, ఆంధ్రకేఫ్‌, ఎస్‌ఆర్‌టి జవహర్‌ స్కూల్‌ ఆటో అడ్డాల్లో సిఐటియు ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించారు.                     
              అశోక్‌నగర్‌ లేబర్‌ అడ్డా వద్ద జరిగిన జెండావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై కపట ప్రేమను చూపిస్తున్నాయని విమర్శించారు. కార్మికులకు మేడే ఒక గొప్ప రోజని అభివర్ణించారు. 18 గంటల పని రోజులను ఎనిమిది గంటలకు కుదించుకోవడం కోసం పోరాటం చేసి, విజయం సాధించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని పక్కన పెట్టి, ఉనికిని చాటు కోవడానికి పాట్లు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం ముందుండాలని, వారి సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని అన్నారు. కార్మికులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా భవన నిర్మాణ రంగంలో పని చేస్తూ సహజ మరణం పొందిన సదానంద్‌ భార్య చంద్రకళకు బిసిడబ్యూ ఇన్స్‌రెన్స్‌ స్కిమ్‌ కింద 30 వేల రూపాయల చెక్కును పిఎస్‌ఎన్‌ మూర్తి అందజేశారు. 
                 ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం దశరథ్‌, ఎస్‌ దశరథ్‌, రాంచందర్‌, శ్రీదేవి, క్రిష్ణస్వామి, రాము, రాజు, సాయి రమేష్‌, ఎల్లయ్య, సోమయ్య, యాకయ్య, వెంకటయ్య, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment