Sunday, January 8, 2012

కాంగ్రెస్‌కు శృంగభంగమే

  • సిపిఎం హైదరాబాద్‌ నగర మహాసభలో మధు
ప్రజాసమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో శృంగభంగం తప్పదని సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు పి మధు హెచ్చరించారు. హైదరాబాద్‌ 19వ నగర మహాసభలు శనివారం నాడు ప్రారంభమయ్యాయి. సభల ప్రారంభం సందర్భంగా గోల్కొండికాస్‌ రోడ్డు నగర కార్యాలయం నుంచి ముషీరాబాద్‌ పార్కు వరకు ర్యాలీ జరిగింది. అనంతరం ముషీరాబాద్‌ పార్కు వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సిపిఎం నగర కార్యదర్శి పిఎస్‌ఎన్‌.మూర్తి అధ్యక్షతన జరిగిన సభలో మధు మాట్లాడుతూ.. 42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి అసమర్థ ముఖ్య మంత్రిని ఎక్కడా చూడలేదని కిరణ్‌కుమార్‌ రెడ్డి పాలనాతీరును నిశితంగా విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యాట్‌ పెంచి ప్రజలపై భారాలు మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరల తాకిడిలో ఓ వైపు ప్రజలు బతుకు భారమై అల్లాడుతుంటే మరోవైపు రకరకాల పన్నులు వేసి మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. విద్యుత్‌ ఛార్జీలు భారీగా పెంచడానికి సిద్ధమయ్యారన్నారు. కేబినెట్‌లో ఉన్న మంత్రులు బ్రాందీ, గుడుంబా, సిండికేట్‌ వ్యాపారాలు చేసుకుంటూ అవినీతిలో కూరుకు పోయారని విమర్శించారు. జగన్‌ అనుచర ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే తన పదవికి ఎసరు వస్తుందనే భయంతో కిరణ్‌కుమార్‌రెడ్డి కాలయాపన చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
                    సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సమస్యలు పరిష్కరించకపోగా భారాలేస్తోంద న్నారు. మరోవైపు సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. ఇది కోతల, వాతల ప్రభుత్వం తప్ప ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం కాదని విమర్శించారు. ప్రపంచబ్యాంకు ఆదేశాలు, సరళీకరణ విధానాలతో అవినీతి పాలక, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా కనివినీ ఎరుగుని రీతిలో పాకిపోయిందన్నారు. అసలు రాష్ట్ర మంత్రిపైనే దాడి జరిగితే రక్షించలేని పోలీసులు సిపిఎం ర్యాలీ అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌ సుధాభాస్కర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల వల్ల నేడు కార్మికవర్గం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోం దన్నారు. ఫిబ్రవరి 28న జరిగే మరో దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర నాయకులు టి.జ్యోతి మాట్లాడుతూ మహిళలపై హింసను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంద న్నారు. మహిళలను లక్షాధికా రులను చేస్తామని గొప్పలు చెప్పి చివరకు మైక్రోఫైనాన్స్‌ ఊబిలోకి తోసిందని విమర్శించారు. పౌరసమస్యలు, ఇళ్లు, ఇళ్ల సమస్యలు, అధికధరలు తదితర అనేక అంశాలపై సిపిఎం నిర్వహించిన పోరాటాలను పిఎస్‌ఎన్‌.మూర్తి గుర్తుచేశారు. ఆదివారం నుంచి జరిగే రెండురోజుల ప్రతినిధుల సభలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.
     ( ప్రజాశక్తి సౌజన్యంతో.....  ) 

No comments:

Post a Comment