Saturday, January 7, 2012

ఉద్యమాలే ఊపిరిగా సిపిఎం సుదీర్ఘ పోరాటం

ఉద్యమాలే ఊపిరిగా సిపిఎం సుదీర్ఘ పోరాటం

  • ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం రాజీలేని పోరు
  • కేసులకు నెరవక పేదలకు అండగా నిలబడిన తీరు
  • లాఠీ దెబ్బలకూ వెనకాడని వైనం
  • అదే స్ఫూర్తితో మరింత ముందుకు..
             ఉద్యమాలే ఊపిరిగా ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఎం నగరంలో తనదైన శైలిలో పోరాటాలు సలుపుతోంది. పేద ప్రజలకు అండగా నిలిచి ఉద్యమాల్లో ముందుంటూ ప్రజాపోరాటాల వారధిగా కొనసాగుతోంది. ఓట్లు, సీట్లతో ప్రమేయం లేకుండా ప్రజా హక్కుల కోసం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పోరాటాలు నిర్మిస్తూ ముందుకు సాగుతోంది. నీతి, నిజాయితీతో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల పక్షాన నిలబడుతోంది. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రస్తుత ప్రభుత్వం తీరును ఎండగట్టాలని, ప్రజలపై మోపుతున్న భారాలను అడ్డుకోవాలని శనివారం నుంచి జరిగే 19 నగర మహాసభల్లో నాయకులు కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ నేపథ్యంలో గత నగర మహాసభలనంతరం సిపిఎం చేపట్టిన పలు పోరాటాలను పరిశీలిస్తే ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం చేసిన పోరాటం రాజీలేనిది. గత మహాసభలకు ముందు తర్వాత గడిచిన నాలుగేళ్లుగా నగర వ్యాప్తంగా పలు బస్తీల్లో గుడిసెవాసులకు సిపిఎం నాయకులు, కార్యకర్తలు అండగా నిలబడ్డారు. తామున్నామంటూ ధైర్యం చెప్పి ప్రజలను పెద్దఎత్తున కదిలించారు. గుడిసెలు కూల్చడానికి ప్రభుత్వం పోలీసు బలగాలతో దమనకాండకు దిగితే ఎదుర్కొన్నారు. అరెస్టులు చేసినా లాఠిచార్జీలతో రక్తం చిందించినా లెక్కచేయకుండా నిలబడ్డారు. స్థానికులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు, ప్రదర్శనలు చేశారు. కలెక్టరేట్‌, సిసిఎల్‌ఎ, జిహెచ్‌ఎంసి తదితర ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడించారు. ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా సిపిఎం నేతృత్వంలో ఇళ్ల కోసం ప్రజలు 2008 ఏడాది మిలిటెంట్‌ పోరాటాల్లో ముందుకురికారు. నేటికీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలపై కేసులు నడుస్తున్నాయి. అయినా నెరవక సుదీర్ఘంగా పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. నాలుగేళ్లలో చేసిన పలుపోరాటాల్లో మచ్చుకు కొన్ని పాఠకుల కోసం.
బోజగుట్ట : బోజగుట్టలో దాదాపు 42 ఎకరాలు సీలింగ్‌ భూమి ఉంది. అందులో గుడిసెలేసుకొని పేదలు సంవత్సరాలుగా నివశిస్తున్నారు. ఆ స్థలంపై భూకబ్జాదారుల కన్ను పడింది. బోగస్‌ సొసైటీలు పుట్టుకొచ్చాయి. స్థలాలు ఆక్రమించడానికి అడ్డుగా ఉన్న పేదలను ఖాళీచేయించడానికి సామ బేద దండోపాయాలు ప్రయోగించారు. పేదలకు అన్యాయం జరిగితే సహించబోమంటూ సిపిఎం నాయకులు ప్రజల పక్షాన నిలబడ్డారు. ప్రభుత్వానికి, కబ్జాదారులకు వ్యతిరేకంగా ఆందోళన, ధర్నా, రాస్తారోకో, నిరాహార దీక్షలు ఇలా పలురూపాల్లో పోరాడారు. మంత్రులు, అధికారులకు వినతిపత్రాలిచ్చారు. చివరకు సిపిఎం పోరాటానికి ప్రభుత్వం తలవంచి 13 ఎకరాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడానికి అంగీకరించింది. నాటి పోరాటంలో సిపిఎం నాయకులపై నేటికీ కేసులు నడుస్తున్నాయి.


          సింగరేణి కాలనీ : 82 ఎకరాల సీలింగ్‌ భూముల్లో కొన్ని సంవత్సరాల కింద పేదలు గుడిసెలేసుకుని నివశిస్తున్నారు. సంబంధిత స్థలంపై కన్నేసిన కబ్జాదారులు బోగస్‌ సొసైటీల పేరుతో స్థలాన్ని ఆక్రమించారు. వారి ఆక్రమణలకు అడ్డుగా ఉన్న పేదలను తరిమేయాలని పలుమార్లు ప్రయత్నించారు. ఆక్రమణలను సిపిఎం ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. అనుకోకుండా 2007లో సంభవించిన అగ్నిప్రమాదంలో గుడిసెలు కాలిపోయాయి. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల మందికి పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీనిచ్చింది. అయితే 1700 మందికి మాత్రమే ఇళ్లు కట్టించి ఇచ్చారు. తక్కిన వారంతా గుడిసెల్లోనే నివశిస్తున్నారు. వారిని అక్కడ నుంచి తరిమేయాలని కబ్జాదారులు, మరోవైపు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వాధికారులు పోలీస్‌ బలగాలతో గుడిసెలు కూలగొట్టారు. అడొచ్చిన వారిని లాఠీÄలను ఝుళిపించారు. అమానుషంగా వ్యవహరించారు. తమ స్వలాభం కోసం పేదలకు అండగా ఉంటామన్న ఇతర రాజకీయ పార్టీలు ద్రోహం చేసి పలాయనం చిత్తగించాయి. అయినా పేదలు ఒంటిరి వారు కాదంటూ సిపిఎం పోరాటంలో నిలబడి గుడిసెలు వేయించింది. మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు, హైకోర్టులో పిల్‌ (ప్రజాప్రయోజనాల వాజ్యం) వేసి న్యాయపోరాటం చేస్తోంది. ఈ పోరాటం నేటికీ కొనసాగుతూనే ఉంది.
బతుకమ్మకుంట : ఒకటిన్నర ఎకరాల స్థలంలో పేదలు నివశిస్తున్నారు. ఆ స్థలాన్ని పార్కుకు కేటాయించాలని జిహెచ్‌ఎంసి పూనుకుంది. పేదలను ఖాళీచేయాలని హుకుం జారీచేసింది. చివరకు పోలీస్‌ బలగాలతో గుడిసెలను కూలగొట్టి తగలబెట్టించింది. సిపిఎం ఈ దమనకాండకు ఎదురొడ్డి నిలబడింది. కార్యకర్తలు, నాయకులు లాఠీÄదెబ్బలకు నెరవక రాజీలేని పోరాటాన్ని సలిపారు. పోరాటాన్ని స్థానిక ప్రజలతో కలిసి ఉధృతం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, కేంద్రకమిటీ సభ్యులు పి మధు లాంటి ఉద్దండులు సైతం పోరాటంలో పాల్గొన్నారు. వారంలోగా తిరిగి గుడిసెలేసి నిలబడ్డారు. చివరకు ప్రభుత్వం దిగొచ్చి ఇళ్లుకోసమే స్థలాన్ని కేటాయించింది. ఇంతవరకు దాదాపు 260 ఇళ్ళు నిర్మించి పేదలకు అప్పగించింది.
మిథాని : మిథాని ఆర్టీసి డిపో పక్కన ఉన్న మూడున్నర ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఒకటిన్నర ఎకరాల స్థలంలో పేదలు గుడిసెలేసుకొని నివశిస్తున్నారు. కబ్జాదారులు స్థలాన్ని ఆక్రమించాలని ప్రయత్నించారు. రెవెన్యూ అధికారుల అండతో ఎన్‌ఓసి ధృవపత్రాలు కూడా సృష్టించారు. పేదలను ఖాళాచేయించాలని విశ్వప్రయత్నం చేశారు. సిపిఎం పోరాటంలో దిగి కలెక్టరేట్‌, సిసిఎల్‌ఎ కార్యాలయాలు ముట్టడించింది. ధర్నాలు చేసింది. చివరకు కలెక్టర్‌ కబ్జాదారుల ఎన్‌ఓసిలు రద్దుచేశారు. స్థానికంగా నివాసమున్న పేదలకు విద్యుత్‌ సరఫరా, రోడ్లు లాంటి మౌలిక సౌకర్యాలు కూడా కల్పించారు.
          జిహెచ్‌ఎంసి ముట్టడి : పైన పేర్కొన్న ప్రాంతాలే కాకుండా సిపిఎం ఆధ్వర్యంలో గత మహాసభలనంతరం ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం పోరాటం కొనసాగించింది. మహేంద్ర హిల్స్‌, బండ్లగూడ, మినిస్టర్‌ రోడ్డు, జోహార్‌నగర్‌, ఉప్పల్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, చార్మినార్‌, ఎల్బీనగర్‌, మల్కాజిగిరి, గచ్చిబౌలితో పాటు 19 జోన్లలోనూ ఇళ్ల కోసం స్థానికులతో కలిసి ఉద్యమాలు చేపట్టింది. ప్రభుత్వం ఇస్తామన్న ఇళ్లు ఇవ్వకపోవడంతో 2008 సెప్టెంబర్‌లో జిహెచ్‌ఎంసి ముట్టడి చేపట్టారు. దాదాపు 10 వేల మంది స్థానిక ప్రజలు కదలివచ్చారు. ప్రభుత్వం స్పందించే వరకూ కదలమని భీష్మించి కూర్చున్నారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో కోపోద్రోక్తులై గేట్లు, ముళ్లకంచెలు దాటుకొని కార్యాలయంలోకి దూసుకుపోయారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. నాయకులతోపాటు వేలాదిమందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. దాదాపు రెండువేల మందిపై కేసులు పెట్టారు. అయినా వెనుకాడక పోవడంతో చివరకు ప్రభుత్వం స్పందించి పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని హామీనిచ్చింది. అయితే నేటికీ అది అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో సిపిఎం నగర మహాసభల్లో నాయకులు మరోసారి ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం పోరాటాన్ని ఉధృతం చేసే దిశలో కార్యాచరణ రూపొందిస్తున్నారు.
( ప్రజాశక్తి సౌజన్యంతో.....  )

No comments:

Post a Comment