కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు విమర్శించారు. పేద ప్రజలపై భారాలు... పెట్టుబడిదారులకు రాయితీలు కల్పిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారాన్ని రూ.12,700 కోట్లు మోపిందని చెప్పారు. ప్రజలపై భారాలు పడకుండా అన్ని పార్టీలూ విద్యుత్‌ఛార్జీలను ప్రధాన సమస్యగా భావించి పోరాటాలు చేయాలని, ప్రభుత్వంపై
ఒత్తిడి పెంచాలని కోరారు. ఈనెల 13 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలను అన్ని పార్టీలూ స్తంభింపచేయాలని సూచించారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరిస్తారా? లేక అధికారం నుంచి దిగిపోతారా?అని ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఐక్యంగా ప్రతిఘటించాలని, వెనక్కి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 31వ తేదీలోపు ప్రభుత్వం ఉపసంహరణపై నిర్ణయం తీసుకోకపోతే వామపక్షాల సమావేశం నిర్వహించి ప్రజా కార్యాచరణను వెల్లడిస్తామన్నారు. ఆహార భద్రత, అధిక ధరలు, నిరుద్యోగం, అవినీతి, విద్యావైద్యం వంటి సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసమే దేశవ్యాప్తంగా గతనెల 24 నుంచి పోరాట సందేశ యాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 3న ఆంధ్రప్రదేశ్‌లోకి యాత్ర అడుగుపెడుతుందని చెప్పారు. అందులో భాగంగానే ఈనెల 5న తేదీన హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. దేశవ్యాప్త యాత్రకు మద్దతుగా హైదరాబాద్‌లో జీపు జాతాను రాఘవులు శుక్రవారం ఫీవర్ ఆస్పత్రి వద్ద పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం ఆధ్వర్యంలో గతనెల 24 నుంచి పోరాట సందేశ యాత్రను కన్యాకుమారి, అమృత్‌సర్, ముంబయి, కొల్‌కతా నుంచి నాలుగు బృందాలు ఢిల్లీకి ఈనెల 19న చేరుకుంటాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలూ, మున్సిపాల్టీలూ, కార్పొరేషన్లలోని ప్రతి ఇంటికీ వెళ్లి సమస్యలు తెలుసుకుంటామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించి పోరాటాలకు సమాయత్తం చేస్తామన్నారు. రైల్వే, సాధారణ బడ్జెట్లలో కేంద్రం ధనవంతులకు రాయితీలు, పేదలపై భారాలు మోపిందని విమర్శించారు. 2013-14 బడ్జెట్‌లో సబ్సిడీ బియ్యానికి రూ.90 వేల కోట్లు కేటాయించారని, గత బడ్జెట్‌లో రూ.85 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. ప్రజలకు చౌక ధరకు బియ్యం ఎలా అందిస్తారని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ సబ్సిడీకి రూ.60 వేల కోట్లు కేటాయించారని చెప్పారు. దీంతో డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలూ పెరుగుతాయన్నారు. పేదలు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఎరువుల సబ్సిడీలకు రూ.60 వేల కోట్లు కేటాయించారని, వ్యవసాయం ఖరీదైపోతుందన్నారు. బియ్యం, పప్పులు, గోధుమల ధరలు పెరుగుతాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. ఈ ప్రభుత్వాలు తమ విధానాలు మార్చుకోవాలని లేదంటే ప్రభుత్వాలనే మార్చాలని చెప్పారు. విద్యుత్ ఛార్జీలను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రూ.12,700 కోట్లు పెంపు ప్రతిపాదనలు మాత్రమే ఇంకా పెంచలేదని సిఎం బూటకపు మాటలు చెప్తున్నారని అన్నారు. టెలిస్కోపిక్ విధానం ఎత్తేయడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారాలు పడతాయన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే ఉద్యమించి పెంచిన ఛార్జీలను వెనక్కి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. టిడిపి, టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సిపి విద్యుత్ ఛార్జీలపై మాటవరుసకు మాట్లాడుతున్నాయని చెప్పారు. ఆయా పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించాలని పోరాటాలు చేయాలని కోరారు. ఇఆర్‌సి ముందు లేవనెత్తిన అంశాలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోవాలని ప్రయత్నిస్తోంతదన్నారు. పారిపోయే అవకాశం ఇవ్వకుండా ప్రజల్లో ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని చెప్పారు. త్వరలోనే వామపక్షాల సమావేశం జరుగుతుందని చెప్పారు. ఇతర పార్టీల వద్దకు వ్యక్తిగతంగా వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరతామన్నారు. మార్చి 31లోపు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలపెంపును ఉపసంహరించకపోతే ప్రజా కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. ఒకవైపు లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తూనే ప్రజా సంఘాల ఆధ్వర్యంలోనూ ఉద్యమాలు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి పిఎస్‌ఎన్ మూర్తి, కార్యదర్శివర్గ సభ్యులు జె వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ః
No comments:
Post a Comment